అమరావతి రాజధాని పోరాటం మళ్ళీ వేడెక్కింది. కరోనా వేళ స్తబ్దుగా ఉన్న ఉద్యమం  కాస్తా మళ్ళీ కాక మీద ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రత్యేకించి రాజకీయ పార్టీలు ఇపుడిపుడే జనంలోకి వస్తున్నాయి. కరోనా కూడా తగ్గుముఖం పట్టింది. ఇక లోకల్ బాడీ ఎన్నికలు కూడా ముందుండడంతో పాటు జమిలి ఎన్నికల ఆరాటం కూడా ఈ ఉద్యమానికి సెగ రేపుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే ఇంతకాలం అమరావతి రాజధానిలో ఒకటే వాయిస్ వినిపించేది. అదే ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలన్నదే ఆ డిమాండ్. దానికి మద్దతుగా 29 గ్రామాల జనం ఉద్యమం చేశారు అంటున్నారు. అది చివరికి ఒక గ్రామ సమస్యగా మారిందని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తూ వచ్చారు. మరో వైపు 300 రోజుల ఉద్యమం అంటూ టీడీపీ ఆ పోరాటాన్ని హైప్ చేస్తోంది. అనుకూల మీడియా కూడా వార్తలు వండి వారుస్తోంది.

ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు ఈ ఉద్యమానికి అది పుట్టిన చోటనే సరైన పోటీ తగిలింది. ఏకంగా బహుజనులే అమరావతి నడిబొడ్డున కూర్చుని మూడు రాజధానుల డిమాండ్  ముందుకు తీసుకురావడం అతి పెద్ద ట్విస్ట్ గా చూడాలి. అమరావతికి ఏదో అన్యాయం జరిగిపోయిందని ఆకాశాన్ని నేలను కలిపేసి చెలరేగిపోతున్న వారికి సరైన జవాబు అన్నట్లుగా మూడు రాజధానుల ఉద్యమం ఇపుడు పురుడు పోసుకుంది.  నిజానికి బహుజనుల విషయంలో ఎవరైనా సానుభూతి చూపుతారు. పేదలు వారు. బలహీనులు కూడా వారే. వారి భూములే అమరావతి రాజధాని అనే యాగంలో పడి సమిధలుగా మారిపోయాయని కూడా చెబుతారు.

ఇపుడు వైసీపీ సర్కార్ యాభై వేల మంది బహుజనులు, దళితులకు అమరావతి రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇచ్చింది. దాని మీద కొందరు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు. ఆ మీదట వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇపుడు సరైన సమయం చూసి వారు ఆందోళనలకు దిగారు. ఇవన్నీ పక్కన పెడితే అమరావతి కొందరి ప్రయోజనాల కోసం ఏర్పడిన రాజధాని అని వైసీపీ అంటూ వచ్చింది. దానికి మరింత ఆధారం అన్నట్లుగా ఇపుడు దళితులకు ఇస్తున్న ఇళ్ల పట్టాలను అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో అమరావతి  బహుజనులు ఆందోళనలు చేయడం, మూడు రాజధానులకు మద్దతుగా ముందుకు రావడం అంటే ఇక ఈ పోరాటం సరికొత్త మలుపు తీసుకున్నట్లే లెక్క. మరి దీని వెనక ఏ ఏ పార్టీలు ఉన్నాయో వేరే చెప్పనక్కరలేదు. మొత్తానికి బయట ఉద్యమం సాగుతోంది. కానీ వెనక రాజకీయం ఉంది. అది రాజుకుని ఏ వైపు పయనిస్తుందో. అమరావతి కధ ఏ తీరం చేరుతుందో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: