ఒక రాజకీయ పార్టీని జనం మెచ్చి ఇచ్చే అవకాశం ప్రజాస్వామ్య దేశంలో కేవలం అయిదేళ్లు మాత్రమే ఇందులో అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలలూ అన్నీ సర్దుకోవడానికే సరిపోతాయి. ఇక చివరి ఆరు నెలలూ ఎన్నికల కోసం హడావుడి పడడంతో పోతుంది. అంటే అచ్చంగా మిగిలేది నాలుగేళ్ళు మాత్రమే. ఎంతో ప్రణాళికతో ముందుకు సాగితే తప్ప కచ్చితంగా అభివృద్ధి పనులు చేయలేరు. ఒక అడుగు ముందు పడాలంటే ప్రజాస్వామ్య దేశంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. అన్నింటికీ మించి విపక్షాల విమర్శలు, వారు సృష్టించే ఆటంకాలు ఇవి కూడా పరిగణనలోకి తీసుకుంటే పుణ్యకాలమే గడచిపోతుంది అనాలి.

ఇదిలా ఉంటే జగన్ అధికారంలోకి వచ్చాక గుప్పెడు మట్టి సిమెంట్ పోసి కనీసం ఒక్క గట్టు కూడా కట్టలేదని టీడీపీ ఆరోపణలు చేస్తూనే ఉంది. ఆయన సీఎం అయ్యారు. ఆ తరువాత జూన్ నెలలో ప్రజా వేదికను కూల్చేశారు. నాడు అంతా ఆశ్చర్యపోయారు కూడా. దాదాపు తొమ్మిది కోట్ల ప్రజా ధనం అలా మట్టిపాలు అయిందని కూడా అనుకున్నారు. అది లగాయితూ జగన్ కూల్చుడుకే ప్రాధాన్యత ఇస్తున్నారు అని టీడీపీ ప్రచారం చేస్తోంది.

అయితే వైసీపీ వాదన కూడా ఇక్కడ వేరేగా ఉంది. అక్రమ కట్టడం కాబట్టి కూల్చామని చెబుతోంది. ఆ తరువాత కూడా కూల్చివేత కార్యక్రమాలు అలా సాగుతూనే ఉన్నాయని అంటున్నారు. ఇపుడు అమరావతి నుంచి విశాఖకు కూల్చుడు కధ వచ్చి చేరిందని అంటున్నారు. విశాఖలో మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహారీని కూల్చిన తరువాత తాజాగా మాజీ  ఎంపీ, దివంగత ఎంవీవీఎస్ మూర్తి గీతం విద్యా సంస్థలలో అక్రమ భవనాలను కూల్చివేత పనులు మొదలెట్టారు. దాని మీద లోకేష్ మాట్లాడుతూ కూల్చివేత అంటే జగన్ కి ఇష్టమని అన్నారు. విద్వంసం చేయకపోతే ఆయనకు కిక్ ఉండదని కూడా విమర్శలు చేశారు.

సరే కూల్చుడి కధ ఇలా ఉంటే వైసీపీ పంచుడు కార్యక్రమం  మీద కూడా విమర్శలు వస్తున్నాయి. సంక్షేమ పధకాలు పేరిట పెద్ద ఎత్తున పంచుడుకు జగన్ తెర తీశారని, ఇది ఓట్ల కోసం ఆడే రాజకీయమని కూడా విపక్షాలు విమర్శలు చేస్తూ వచ్చాయి. బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి అయితే ఎపుడూ పంచుడేనా. ఏపీలో ఆదాయం పెంచుడు అన్నది లేదా జగన్ అంటూ గట్టిగానే తగులుకున్నారు. మరో వైపు జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే ఏపీలో సంపద సృష్టించే కార్యక్రమాలు జరగడం లేదని పెద్ద మాటే అనేశారు. కూల్చుడు, పంచుడు విషయంలో వైసీపీ ఎంత సమర్ధించుకున్నా జనంలోకి వ్యతిరేకంగా వెళ్తే మాత్రం ఇబ్బందే. దాంతో వైసీపీ పెద్దలు ఇకనైనా ఆలోచించుకోవాలి అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: