ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ పండగ చేసుకుంటున్నాయి. ప్రయాణీకుల నుంచి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. మాములుగా ఉండే ధరలతో పోలిస్తే.. ఇప్పుడు డబుల్‌, త్రిపుల్‌ ఛార్జీలు చెబుతున్నారు.

ఈ సారి కరోనా ఎఫెక్ట్‌తో దసరా కాస్త కళతప్పింది. ఎప్పుడూ ఉండే సందడి కనిపించడంలేదు. అయితే ఎలాగోలా సొంతూరుకు వెళ్లైనా.. పండగ జరుపుకుందామని అనుకుంటున్న వారిని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దోచుకుంటున్నాయి. మామూలుగా ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నప్పుడే.. పండగ సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్‌ దోపిడీ మాములుగా ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది.

దసరా నేపథ్యంలో ప్రయివేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు ఛార్జీల పేరుతో ప్రయాణికులను దోచుకుంటున్నాయి. ప్రయాణికుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నాయి. బెజవాడ నుంచి హైద్రాబాద్‌కి వెయ్యి నుంచి 1,200 వరకు వసూలు చేస్తున్నారు.

కొన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ అయితే రాను, పోను టికెట్లు తీసుకున్న వారికి స్వల్ప రాయితీలు కూడా ఇచ్చేస్తున్నాయి. కాకినాడ-హైదరాబాద్‌కి బస్సు టిక్కెట్‌ సాధారణంగా నాన్‌ ఏసీకి రూ.600- 650 చొప్పున వసూలు చేస్తారు. అదే ఏసీ బస్సులకు రూ.వెయ్యి వరకూ ఉంటుంది. కానీ ప్రస్తుతం నాన్‌ ఏసీకి వెయ్యి నుంచి రూ.1,500, ఏసీ బస్సులకు రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రతి ప్రయాణికుడూ కనీసం రూ. 500 నుంచి రూ.వెయ్యి వరకూ అదనంగా భారం పడుతోంది. దీనికితోడు లగేజీ ఛార్జీలు వసూలు చేయకూడదనే నిబంధనలున్నప్పటికీ చిన్న చిన్న లగేజీలకు కూడా రూ.200కిపైగా వసూలు చేసేస్తున్నారు.

రవాణా శాఖ అధికారుల తనిఖీలు నామమాత్రంగా ఉండటంతో.. ప్రయివేటు దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రస్తుతం విద్యా సంస్థలు తెరుచుకోకపోవడం..  పెళ్లిళ్ల సీజన్‌ కూడా దగ్గరలో ఉండటంతో..  అనేక మంది హైదరాబాద్‌ నుంచి సొంత ప్రాంతాలకు వస్తున్నారు. ఈ రద్దీని ప్రయివేటు బస్సుల యజమానులు సొమ్ము చేసుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: