అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, జో బైడెన్ హోరాహోరీగా తలపడుతున్నారు. ప్రచారం చివరి దశకు చేరుకుంది. అమెరికా ఎన్నికల్లో ఈ సారి కరోనాను ప్రధానాస్త్రంగా చేసుకొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఇద్దరు నాయకులు. కరోనా వ్యాక్సిన్‌ ప్రజలందరికీ ఉచితంగా ఇస్తామని ఎవరికి వారే ప్రకటనలు చేస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ విమర్శలు వాడి పెంచుతున్నారు అభ్యర్థులు. కరోనా విషయంలో ట్రంప్‌ను బైడెన్‌ కార్నర్‌ చేస్తుంటే.. మరో నాలుగేళ్లు అమెరికాకు అధ్యక్షుడిగా ఉండాల్సిన అవసరం ఉందని రిపబ్లికన్‌ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తొలివిడత అధికారంలో ట్రంప్ యంత్రాంగం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్లు చెపుకొచ్చారు.

 బైడెన్‌-హారిస్‌ ద్వయం అమెరికాను వెనక్కి తీసుకువెళ్లే ప్రమాదముందని ఆరోపణలు చేశారు రిపబ్లికన్లు. అలాగే జో బైడెన్‌ అధికారంలోకి వస్తే మధ్యతరగతి ప్రజలపై పన్నులు పెంచుతారని, ఉద్యోగాలు పోతాయంటూ విమర్శలు చేశారు. కానీ, గత మూడు ఏళ్లలో ట్రంప్ పన్నులు తగ్గించి, లక్షల కొద్ది ఉద్యోగాలను సృష్టించారని చెప్పుకొచ్చారు. మీకు ఉద్యోగాల సృష్టికర్త కావాలో లేక ఉద్యోగాలను విదేశాలకు తరలించే వ్యక్తి కావాలో తేల్చుకోవాలన్నారు.

మరోవైపు కరోనాపై పోరులో ట్రంప్‌ చేతులెత్తేశారని ఆరోపించారు జో బైడెన్‌. తాను అధికారంలోకి వస్తే అమెరికా ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా అందజేస్తామని  జో బైడెన్‌ హామీ ఇచ్చారు. మహమ్మారిని అంతమొందించేందుకు  జాతీయ విధానాన్ని రూపొందిస్తామని తెలిపారు. భారతీయ అమెరికన్‌ ఓటర్లను ఆకట్టుకునేందుకు డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్‌ ప్రయత్నిస్తున్నారు.  భారతీయులు, భారత్‌ పట్ల ఆయనకున్న మక్కువను తెలుపుతూ  ఓ ప్రధాన పత్రికలో వ్యాసం రాశారు. భారత సంతతికి చెందిన ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌ గొప్పతనాన్ని  బైడెన్‌ హైలైట్‌ చేసే ప్రయత్నం చేశారు.

అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రధానంగా కరోనా వ్యాప్తి, కట్టడి, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం చుట్టే తిరుగుతున్నాయ్‌. దీంతో ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు వ్యాక్సిన్‌ హామీని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. ట్రంప్‌ సైతం కొన్ని వారాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: