ఏపీలో మరోసారి నిమ్మగడ్డ వర్సస్‌ ఏపీ సర్కారులా వ్యవహారం కనిపిస్తోంది. త్వరలోనే పదవి నుంచి దిగిపోబోతున్న నిమ్మగడ్డ ఎలాగైనా తాను దిగిపోయేలోగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్టు ఆయన చర్యల ద్వారా తెలుస్తోంది. అయితే.. విచిత్రం ఏంటంటే.. కరోనా ఒక్క కేసు ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టాల్సిందే అని జగన్ అన్నాడు.. అప్పుడు కుదరదని నిమ్మగడ్డ అన్నాడు.. ఇప్పుడు వేల కేసులు వస్తుంటే.. ఎన్నికలు పెట్టాలని నిమ్మగడ్డ చూస్తున్నాడు.. జగన్ మాత్రం అబ్బే ఇప్పుడు కుదరదు అన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఏపీలో ఇప్పట్లో ఎన్నికలు పెట్టే ఆలోచన లేదని మరో మంత్రి కొడాలి నాని క్లారిటీ ఇచ్చేశారు. క‌రోనా ఏమీ లేన‌ప్పుడు స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌ను వాయిదా వేసి, ఇప్పుడు దాని ప్రభావం ఎక్కువ‌గా ఉన్నప్పుడు జ‌రిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడం ఏంటని మంత్రి కొడాలి నాని విరుచుకుప‌డ్డారు. రాష్ట్రంలో తాను చెప్పిందే వేదం అన్నట్టు నిమ్మగ‌డ్డ వ్యవ‌హ‌రిస్తున్నార‌ని కొడాలి నాని మండిప‌డ్డారు. ఇది స‌రైన వైఖ‌రి కాద‌ని.. మ‌రో కొన్ని నెల‌లు మాత్రమే నిమ్మగ‌డ్డ త‌న ప‌ద‌విలో కొన‌సాగుతార‌ని నాని చెప్పారు.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మగ‌డ్డ ర‌మేశ్‌కుమార్ కంటే రాష్ట్ర ప్రజ‌ల శ్రేయ‌స్సు ముఖ్యమ‌న్నారు మంత్రి కొడాలి నాని. అంతా త‌నిష్టం వ‌చ్చిన‌ట్టు చేస్తాన‌ని, తాను చెప్పిందే రాజ్యాంగ‌మ‌ని నిమ్మగ‌డ్డ అనుకుంటే కుద‌ర‌ద‌ని కొడాలి నాని చెప్పేశారు. ప్రభుత్వాన్ని సంప్రదించ‌కుండా నిమ్మగడ్డ ఏమీ చేయ‌లేర‌ని... రాష్ట్రంలో ఎన్నిక‌లు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాల‌ని, అలా కాకుండా తానే నిర్వహిస్తాన‌ని ఎన్నిక‌ల సంఘం అనుకుంటే జ‌రిగే ప‌ని కాద‌ని కొడాలి నాని అన్నారు.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని కొడాలి నాని అన్నారు. కరోనా మహమ్మారి వల్ల ఎన్నిక‌ల్లో ఓట్లు వేసేందుకు ఎవ‌రూ వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని నాని అన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌ను నిర్వహించే ఆలోచ‌న ప్రస్తుతానికి ప్రభుత్వానికి లేద‌ని కొడాలి నాని స్పష్టం చేశారు. అంతే కాదు.. ద‌స‌రా త‌ర్వాత క‌రోనా ఉధృత‌మ‌వుతుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నార‌ని కొడాలి నాని అంటున్నారు. సో.. మొత్తానికి నిమ్మగడ్డ పదవి నుంచి దిగిపోయే వరకూ ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: