బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సంగ్రామానికి సమయం దగ్గరపడుతోంది. మరో నాలుగు రోజుల్లో మొదటి విడత ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తూ మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ప్రజల చెంత వాలిపోయి హామీల వర్షం కురిపిస్తున్నారు.

బీహార్‌లో పార్టీల మ్యానిఫెస్టోలన్నీ ఉద్యోగాల కల్పన చుట్టే తిరుగుతున్నాయి‌. బీజేపీ 19 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ప్రకటిస్తే, ప్రత్యర్థి ఆర్జేడీ 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మ్యానిఫెస్టోలో తేజస్వి యాదవ్ వరాల జల్లు ప్రకటించారు. పేదవారికి, వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ 400 నుంచి వెయ్యిరూపాయలకు పెంచుతామని తెలిపారు. అలాగే నిరుద్యోగులకు 1,500 భృతి అందిస్తామన్నారు. 50 ఏళ్ల పైబడిన ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా రిటైర్ కావాలన్న నిబంధన వెనక్కి తీసుకుంటామన్నారు.

మరోవైపు ప్రధాన పార్టీలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి‌. ఇప్పటికే బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి బీహార్‌ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం నీతిశ్‌ కుమార్‌తో కలిసి ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా. అవినీతిని నీతిష్‌ కుమార్‌ సమూలంగా నిర్మూలించారని, కరోనా వైరస్ నివారణలో కూడా చక్కగా పనిచేశారని కితాబిచ్చారు జేపీ నడ్డా.

కాంగ్రెస్‌ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. బీజేపీ, కేంద్రం తీరుపై విరుచుకుపడుతోంది. ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కాదు బీహార్‌కి ప్రత్యేక హోదా ప్రకటించే ధైర్యం ఉందా అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.  దేశ సైనికులను నరేంద్ర మోడీ అవమానించారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. మోడీజీ.. చైనా దళాలను వారి భూ భాగంలోకి ఎప్పుడు తరిమేస్తున్నారో చెప్పండి అని రాహుల్‌ ప్రశ్నించారు. మొత్తానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల యుద్దానికి సమయం దగ్గర పడుతుండటంతో.. పార్టీలు ఓటర్లకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: