కరోనా కారణంగా ఏపీలో వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఎన్నికలు జరిపేందుకు ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలు చేస్తుంటే.. అసలు ఎన్నికలు జరిగే అవకాశమే లేదని వైసీపీ మంత్రులు ముందుగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి వాదన నిలబడుతుంది? ఎవరి మాట చెల్లుబాటు అవుతుంది? చివరకు ఈ విషయంలో కూడా కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి వస్తుందా? అనే విషయాలు చర్చనీయాంశమయ్యాయి.
మరో రెండు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆగిపోయిన స్థానిక ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నించబోతున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచనలు అడగబోతున్నారు. అయితే ఈ లోగా రాష్ట్ర మంత్రులు మాత్రంత ఎన్నికలు జరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. రెండు రోజుల క్రితం స్థానిక ఎన్నికలపై స్పందించారు. ఇప్పుడల్లా ఎన్నికలు జరగవని స్పష్టం చేశారు. తాజాగా మరో మంత్రి కొడాలి నాని ఏకంగా నిమ్మగడ్డ వ్యవహారంపై మండిపడ్డారు. మ‌రో కొన్ని నెల‌లు మాత్ర‌మే నిమ్మ‌గ‌డ్డ త‌న ప‌ద‌విలో కొన‌సాగుతార‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వానికి ర‌మేశ్‌కుమార్ కంటే రాష్ట్ర ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు ముఖ్య‌మని అందుకే ఎన్నికలు జరపబోమని చెప్పారు.

ఎన్నికల విషయంలో అంతా త‌న ఇష్టం వ‌చ్చిన‌ట్టు చేస్తాన‌ని, తాను చెప్పిందే రాజ్యాంగ‌మ‌ని నిమ్మ‌గ‌డ్డ అనుకుంటే కుద‌ర‌ద‌ని కొడాలి నాని అన్నారు. ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించ‌కుండా నిమ్మ‌గ‌డ్డ ఏమీ చేయ‌లేర‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నిక‌లు నిర్వ‌హించాలంటే ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించాల‌ని, అలా కాకుండా తానే నిర్వ‌హిస్తాన‌ని ఎన్నిక‌ల సంఘం అనుకుంటే జ‌రిగే ప‌ని కాద‌న్నారు. కరోనా మహమ్మారి వల్ల ఎన్నిక‌ల్లో ఓట్లు వేసేందుకు ఎవ‌రూ వ‌చ్చే ప‌రిస్థితి లేద‌న్నారు. ప్ర‌జారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించే ఆలోచ‌న ప్ర‌స్తుతానికి ప్ర‌భుత్వానికి లేద‌ని నాని స్ప‌ష్టం చేశారు.

మంత్రుల మాటే సీఎం జగన్ మాట. అంటే జగన్ కి కూడా ఎన్నికలను ఇప్పుడల్లా జరపడం ఇష్టంలేదు. అందులోనూ ప్రభుత్వాన్ని కోర్టుకీడ్చిన నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలకు వెళ్లడం అస్సలు ఇష్టం లేదు. అందుకే మంత్రులతో అలా చెప్పించారు. అయితే నిమ్మగడ్డ మాత్రం తాను వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. కోర్టుల జోక్యంతో తాను ఎలా తిరిగి పదవిలోకి వచ్చారో.. అలాగే కోర్టుల జోక్యంతోనే తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల హైకోర్టు జోక్యంతో ఎన్నికల కమిషన్ కు రావాల్సిన నిధుల్ని ప్రభుత్వం నుంచి వసూలు చేసిన నిమ్మగడ్డ, మరోసారి ఎన్నికల విషయంలో కోర్టుని ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే, ఎన్నికలు జరుపుకోవాలని కోర్టు తీర్పునిస్తే.. జగన్ సర్కారుకు మరో ఎదురు దెబ్బ తగిలినట్టవుతుంది. ఎన్నికల ఫలితాల విషయం పక్కనపెడితే.. తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: