విశాఖలోని ప్రతిష్టాత్మకమైన గీతం విద్యా సంస్థలు అక్రమంగా ప్రభుత్వ భూములు కలిగి ఉన్నాయన్న ఆరోపణల నేపధ్యంలో కొన్ని నిర్మాణాలను కూల్చివేశారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయింది. ఈ విషయంలో తెలుగుదేశం అనుకూల మీడియా అయితే తెగ హడావుడి చేసింది. జగన్ని విద్వంస‌కుడిగా విలన్ గా కూడా చేస్తూ వార్తలు వండి వార్చారు. ఇక చంద్రబాబు, లోకేష్ అయితే జగన్ సర్కార్ మీద ఒక రేంజిలో రెచ్చిపోయారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఇంతకీ గీతం విద్యా సంస్థల కధ ఏంటి, అది ఇంతవరకూ రావడానికి కారకులు ఎవరు అన్న విషయాలను చూస్తే చాలా కనిపిస్తాయి. చంద్రబాబుకు నిజంగా గీతం వ్యవస్థాపకుడు దివంగత ఎంవీవీఎస్ మూర్తి కుటుంబం మీద ప్రేమ లేదని వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. దానికి గల కారణాలు కూడా ఆయన చెప్పుకొచ్చారు. గీతం కధలోకి వెళ్తే 2014లో అంటే చంద్రబాబు సర్కార్ అధీకారంలోకి వచ్చిన తరువాత అక్రమ భూములను క్రమబద్ధీకరించమని గీతం సంస్థలు బాబు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయట.

అయితే అయిదేళ్ళ పుణ్యకాలం గడచిపోయినా బాబు మాత్రం ఆ దరఖాస్తును కనీసం పరిశీలించలేదని చెబుతారు. దాని ఫలితంగానే గీతం భూములు అలా అక్రమంగానే రికార్డుల్లో ఉండిపోయాయి. దీంతో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే క్రమంలో  వైసీపీ సర్కార్ వాటికి గురి పెట్టింది. ఇదీ అసలు కధ. మరి రెండేళ్ళ క్రితం వరకూ టీడీపీలో ఉంటూ వ‌చ్చిన అవంతికి ఈ కధ బాగా తెలుసు. ఇంకా బాగా చెప్పాలంటే ఆయన కూడా విద్యా సంస్థల అధినేత. అందువల్ల ఆయన అసలు గుట్టు బయటపెడుతున్నారు. బాబుకు గీతం సంస్థల అధినేతల  మీద నిజమైన  ప్రేమ లెదని, ఉన్నది వట్టి రాజకీయం మాత్రమేనని కూడా అంటున్నారు. మొత్తానికి చేసినది వైసీపీ సర్కార్ అయినా చేయించినది మాత్రం కచ్చితంగా బాబేనని ఆయన మాటల ద్వారా చెప్పేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: