ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి అపుడే పదిహేడు నెలలు గడచిపోయాయి. చెప్పుకునేందుకు సంక్షేమ కార్యక్రమాలు లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ అభివృద్ధి విషయంలో మాత్రం ప్రభుత్వానికి పాస్ మార్కులు కూడా రావడంలేదు. ఆ మార్కులకు ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. ఇదిలా ఉంటే ఏపీకి జీవనాడి లాంటి పోలవరం విషయంలో జగన్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇది ఎటూ జాతీయ ప్రాజెక్ట్, దానికి కేంద్రం బాగానే  నిధులు ఇస్తుంది. దాంతో 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తే ఆ క్రెడిట్ తమ ఖాతాలో పడుతుందని జగన్ గట్టిగానే  ఆశించారు.

కానీ అదిపుడు సాకారం అయ్యేలా కనిపించడంలేదు. ఇక్కడే కేంద్రం అడ్డం తిరిగింది. 2014 అంచనా లెక్కలను చూపిస్తూ దానికి మాత్రమే తాము కట్టుబడి ఉంటామని అంటోంది. అంటే అప్పటి లెక్కల ప్రకారం 20 వేల కోట్లు మాత్రమే తాము పోలవరానికి నిధులు ఇస్తామని ఖరాఖండీగా తేల్చేస్తోంది. అదే సమయంలో  ఇప్పటి అంచనా వ్యయం చూస్తే 55 వేల కోట్లు. అంటే కచ్చితంగా ఇంతకు మూడింతలు. మరి ఆ మొత్తం ఎవరు భరిస్తారు. పోలవరం అసలు  పూర్తి అవుతుందా. ఇవన్నీ సందేహాలే.

దీని మీద జగన్ తన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిని ఢిల్లీ పంపించారు. ఆయన కేంద్ర పెద్దలను కలసి అసలు సంగతి విన్నవించుకున్నారు. కానీ కేంద్రంలో ఉన్నది మోడీ. వారు తగ్గుతారు అంటే అది పెద్ద డౌటే. మరి ఇపుడు జగన్ ఏం చేయాలి. అంటే కేంద్రంతో ఢీ కొట్టాల్సిందే. దాంతో అర్జంటుగా జగన్ మంత్రులు, అధికారులతో ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం జరిగిన తీరు, అందులో జగన్ చేసిన వ్యాఖ్యలు కనుక పరిశీలిస్తే కేంద్రం మీద కాస్తా కటువుగానే ఉండాలనుకుంటున్నట్లుగా అర్ధమవుతోంది.

పోలవరం బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుంటే జగన్ కూడా సమరానికి తెర తీయాల్సిందే. జగన్ అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం వెనక్కు తగ్గరు అని వైసీపీ నాయకులు అంటున్నారు. మరి మోడీతో హానీమూన్ ముగిసిందా. యుద్ధానికి రెడీ అవుతున్నారా అంటే వెయిట్ అండ్ సీ.


మరింత సమాచారం తెలుసుకోండి: