ఏపీ సర్కారుకు ఏపీ హైకోర్టు రాత్రికి రాత్రే షాక్ ఇచ్చేసింది. విశాఖలోని గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేత వ్యవహారంలో తదుపరి చర్యలను సోమవారం వరకు నిలుపుదల చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ ఆదివారం చేపడతామని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి శనివారం రాత్రి ఈమధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.  ముందస్తు నోటీసు  ఇవ్వకుండా అధికారులు అక్రమంగా వర్సిటీ కట్టడాలను కూల్చివేస్తున్నారని గీతం యూనివర్శిటీ హైకోర్టును ఆశ్రయించింది.

నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రక్రియ పెండింగ్‌లో ఉండగా  కూల్చివేతలకు దిగారంటూ వర్సిటీ యాజమాన్యం హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో న్యాయమూర్తి నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చారు. శనివారం తెల్లవారు జాము నుంచి విశాఖలో అధికారులు గీతం యూనివర్శిటీలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేత ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ యూనివర్శిటీ ప్రభుత్వ భూములు ఆక్రమించిందని ప్రభుత్వం చెబుతోంది. విశాఖ గీతం విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం, ప్రహరీ గోడ కొంతభాగం, సెక్యూరిటీ గదులను ఇప్పటికే మున్సిపల్‌ సిబ్బంది కూల్చివేశారు.

అసలు ఈ కూల్చివేతలు ఎందుకంటే.. గీతం వర్సిటీకి చెందిన 40 ఎకరాల భూమి ఆక్రమణలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆర్డీవో పెంచల కిశోర్‌ ధ్రువీకరిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి వర్సిటీ యాజమాన్యం సంప్రదింపులు జరిపిందంటున్నారు.  అక్రమ కట్టడాలు కూల్చివేయడం ప్రభుత్వ విధానం అని ఆర్డీవో చెప్పారు. అక్రమణలో ఉన్న భవనాలను కూల్చివేస్తున్నామని.. ఇప్పటికి ప్రహరీ గోడ, ప్రధాన ద్వారం కూల్చివేశామని ఆయన తెలిపారు. ఆక్రమణలో ఉన్న భూమిలో మరికొన్ని కట్టడాలను గుర్తించామని తదుపరి దశలో వాటిని కూడా కూల్చివేసే ప్రక్రియ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

అయితే గీతం యాజమాన్యం మాత్రం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారని చెబుతోంది. హైకోర్టుకు కూడా అదే చెప్పింది. మరి నోటీసులు ఇచ్చారా ఇవ్వలేదా అనే విషయంపై ప్రభుత్వం కోర్టుకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: