ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ లో జరగరానిది ఏదో జరిగిపోతుంది అన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. ముఖ్యంగా ఏపీ సీఎంగా జగన్ మరెంతోకాలం ఆ పదవిలో ఉండలేరు, త్వరలోనే ఆ పదవి ఆయనకు దూరమవుతుందని, ఆ స్థానంలో జగన్ సతీమణి భారతి కానీ, ఆయన తల్లి విజయమ్మ కాని బాధ్యతలు స్వీకరిస్తారు అంటూ అదేపనిగా టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం అవుతుండడం, ఆ ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని టిడిపి అదే పనిగా ఈ విషయాలను హైలెట్ చేస్తూ వస్తూ ఉండడం వంటి పరిణామాలు కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అలజడులు సృష్టిస్తున్నాయి. 



ఇక నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ, కొద్దిరోజులుగా హడావుడి చేస్తున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఈ ప్రచారం ఊపందుకోవడంతో వెనుక కారణాలు పరిశీలిస్తే, కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ పై అనేక అభియోగాలు చేస్తూ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. రాజ్యాంగ వ్యవస్థలను తప్పుపడుతూ జగన్ చేసిన ఈ సాహసంపై దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. దీనిని టిడిపి, ఆ పార్టీ అనుకూల మీడియా తమకు అనుకూలంగా మార్చుకుని, జగన్ రాజ్యాంగ వ్యవస్థ లతో తల పడుతున్నారని, ఇది ఖచ్చితంగా ఆయన సీఎం సీటుకు ఎసరు తెస్తుందనే ప్రచారాన్ని మొదలుపెట్టారు.


 టిడిపి అనుకూల మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని, జగన్ రాజకీయ ప్రత్యర్థులు అంతా, ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ, ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీంతో నిజంగానే సీఎం మారబోతున్నారా అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. అలాగే జగన్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే, వ్యతిరేకత వస్తుందని, ప్రస్తుత సీనియర్ మంత్రులు గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, బొత్స సత్యనారాయణ కానీ ఆ పదవిలో కూర్చుంటారు అంటూ మరో ప్రచారాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చారు. దీంతో ఇప్పుడు ఏపీలో సీఎం మార్పు అనే అనవసర గందరగోళం మొదలైంది. అయితే ఇవన్నీ అసత్య కథనాలు అంటూ వైసిపి కొట్టి పారేస్తున్నా, జగన్ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం అదే పనిగా ఈ విషయాలను హైలెట్ చేస్తూ మానసిక ఆనందం పొందుతున్నట్టుగా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: