అమరావతి: ఏపీ ప్రభుత్వం వాహనదారులకు భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. వాహనదారులు ఏ చిన్న తప్పు చేసినా ఇక నుంచి కనీసం రూ.10 వేలు చెల్లించేలా ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇక దీనిపై పెద్దఎత్తున్న విమర్శలు వస్తున్నాయి. భరత్ నేను సినిమాలో చేసిన విధంగా చేస్తారా అంటూ వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఇక దీనిపై రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి, బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించేవారికి, జీవితం పట్ల అవగాహన లేని వారికి సరైన క్రమశిక్షణ నేర్పించే ఉద్దేశంతోనే జరిమానాలు పెంచామని మంత్రి పేర్ని నాని తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. వాహనాలకు సంబంధించి సక్రమమైన పేపర్లు కలిగి, రూల్ పాటిస్తూ వాహనాలు నడిపేవారికి ఈ విధానం శ్రీరామ రక్షగా నిలుస్తుందని, దీన్ని సామాజిక బాధ్యతగా వాహనదారులు భావించాలని నాని చెప్పారు.  ఇష్టారీతిన వాహనాలు నడిపితే చర్యలు తీసుకోకూడదా? అని ప్రశ్నించారు. ఫిట్నెస్ లేని వాహనాలను వదిలేయాలా? అని నిలదీశారు. ముందు గోతులు పూడ్చండి తర్వాత ఫైన్లు వేయాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుననారని.. భారీ వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. గుంతలుపడితే వాహనాలను ఇష్టమొచ్చినట్లు నడిపించొచ్చా? అని ప్రశ్నించారు. భరత్ అనే నేను సినిమా చూసి చప్పట్లు కొడతారు.. కానీ, అలా నిజ జీవితంలో చేస్తే సీఎం వైఎస్ జగన్‌ను విమర్శిస్తారా? అని నిలదీశారు.

21 సెక్షన్ల మినహాయింపుపై విన్నపాలు వస్తున్నాయని, దీనిపై కేంద్రాన్ని కోరతామని చెప్పారు. ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఫైన్లు వేయడం లేదని.. తప్పు చేయకుండా ఉండటానికేనని స్పష్టం చేశారు మంత్రి పేర్ని నాని. ఆర్టీసీ బస్ సేవల గురించి వివరిస్తూ వ్యాపార ధోరణితో రెండు తెలుగు రాష్ట్రాలు వ్యవహరించడం లేదని, కేవలం ప్రజలకు రవాణా సౌకర్యం పునరుద్దరించాలనే ఉద్దేశంతో ఏపీఎస్ ఆర్టీసీ 1.04 లక్షల కిలోమీటర్లు తగ్గించుకుందని, 1.61 లక్షల కిలోమీటర్లకే పరిమితం చేస్తూ తెలంగాణ ఆర్టీసీ అధికారులు కోరినట్లే ప్రతిపాదనలు పంపామన్నారు. రూట్ల వారీగా స్పష్టత కూడా ఇచ్చామని, ఈ ప్రతిపాదనలతో ఏపీఎస్ ఆర్టీసీ లాభ నష్టాలను చూడకుండా కేవలం ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా టీఎస్ ఆర్టీసీ డిమాండ్లకు అనుకూలంగా ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో జూన్ 18వ తేదీ నుంచి చర్చలు జరుపుతున్నామని మంత్రి అన్నారు. ఆర్టీసీ కార్గో సేవలు మాత్రం కోవిడ్ సమయంలో సైతం కొనసాగుతున్నయని పేర్ని నాని తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ మధ్య ఒప్పందం కుదరలేదు. దీంతో బోర్డర్ వరకే బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈనెల 27వ తేదీన సమావేశంలో నిర్ణయించిన తర్వాత శాశ్వత ఒప్పందం తర్వాతే బస్సులు నడపాలని నిర్ణయించారు.

తెలంగాణ, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు కేవలం బోర్డర్ వరకు వెళ్తాయి. ఆ తర్వాత మీరు బోర్డర్ దాటి మరో బస్సు ఎక్కాల్సిందే. దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఏపీ సరిహద్దు చెక్ పోస్టుల వరకు బస్సులు నడపనున్నట్టు మంత్రి నాని చెప్పారు. పంచలింగాల, గరికపాడు, వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెం ల వద్ద ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచామని, ఈ అవకాశం ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బైక్‌లు, ఆటోలు, సెవన్ సీటర్, కార్ల వరకు ఒక కేటగిరీగా భావించి వాటికి జరిమానాలు విధిస్తారు. భారీ వాహనాలైన లారీలు, బస్సులు, ఇతరత్రా గూడ్స్ వెహికల్స్‌ను మరో కేటగిరీగా భావించి వాటికి జరిమానాలు వేస్తారు. ఇక ప్రభుత్వం విధించిన జరిమానాల లెక్క ఒకసారి పరిశీలిస్తే.. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసే వారికి రూ.10,000 జరిమానా, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారికి రూ.10,000 జరిమానా, ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10,000 ఫైన్, అనవసరంగా హారన్ మోగిస్తే మొదటిసారి రూ.1000, రెండోసారి రూ.2000 జరిమానా, రేసింగ్‌లో మొదటి సారి పట్టుబడితే రూ.5000, రెండోసారి పట్టుబడితే రూ.10,000 జరిమానా, రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకుండా పట్టుబడితే మొదటి సారి రూ.2000, రెండోసారి రూ.5000 జరిమానా, పర్మిట్ లేని వాహనాలు నడిపితే రూ.10,000 జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: