అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు అక్రమాస్తులపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు నవంబర్‌ 24కు వాయిదాపడింది. సీఎంగా ఉన్న సమయంలో భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన నేపథ్యంలో ఏసీబీ విచారణకు ఆదేశించాలని లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిలిపి వేయాలంటూ బాబు హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందారు. ఈ కేసును విత్ డ్రా చేసుకోమంటూ చంద్రబాబు తనపై ఒత్తిడి తీసుకొచ్చారని, కానీ తాను ఒప్పుకోలేదని లక్మీపార్వతి చెప్పారు. లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు విషయంలో ఏసీబీ కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళతానని వెల్లడించారు. అక్కడ కూడా న్యాయం దక్కకుంటే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని, ఏది ఏమైనా చంద్రబాబును జైలుకు పంపకుండా వదిలేది లేదని వ్యాఖ్యానించారు.

ఇక, గతంలోనూ ఈ కేసును ఉపసంహరించుకోవాలని గతంలో చంద్రబాబు తనకు ఫోన్‌ చేసి ఒత్తిడి చేశారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఇక, చంద్రబాబు ఆస్తులకు సంబంధించిన కేసు విచారణ మొదట ఈ నెల 21కి వాయిదా పడింది. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీపార్వతి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలని కోరారు. చంద్రబాబుపై స్టే వేకెట్‌ అయిన వివరాలను ఆమె స్వయంగా కోర్టుకు సమర్పించారు. 1978 నుంచి 2005 వరకు చంద్రబాబు ఆస్తుల వివరాలను ఆమె కోర్టు ముందుంచారు. కాగా, 2004 ఎన్నికల అఫిడవిట్‌లో చంద్రబాబు చూపిన ఆస్తులపై లక్ష్మీపార్వతి ఏసీబీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 1987 నుంచి 2005 వరకు చంద్రబాబు అక్రమంగా తన వ్యక్తిగత ఆస్తులను పెంచుకున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏసీబీ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో 2005లో హైకోర్టు నుంచి చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. అయితే ఇటీవలే ఆ స్టే వెకేట్‌ అయింది. ఈ తరుణంలో ప్రజాప్రతినిధుల కేసుల విచారణలో భాగంగా చంద్రబాబు ఆస్తుల కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ప్రజా ప్రతినిధుల కేసుల విచారణలో భాగంగా దర్యాప్తు ముమ్మరం కానుంది. నవంబర్ 24న చంద్రబాబు కేసులో కోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్ని కేసులు వచ్చినా స్టే లతో బయటపడుతూ వస్తారని చంద్రబాబు గురించి అందరికి తెలిసిన విషయమే. మరి ఈ అక్రమాస్తుల కేసులో కూడా చంద్రబాబు తప్పించుకుంటారా లేక న్యాయస్థానం ఆయనను శిక్షిస్తుందా అన్నది వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: