బీహార్ ఎన్నికలు ఈసారి యమ టెన్షన్ పెడుతున్నాయి. మరో మూడు రోజుల్లో తొలిదశ పోలింగ్ కి సర్వం సిద్ధం అయింది. ఓ వైపు రాజకీయంగా పూర్తి అనుభవం ఉన్న నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో జేడీయూ, బీజేపీ కూటమి ఎన్నికలను ఎదుర్కొంటోంది. మరో వైపు చూసుకుంటే నితీష్ కి ఇద్దరు యువకులు ప్రత్యర్ధులుగా నిలిచి  గట్టిగా సవాల్ విసురుతున్నారు. వారి తండ్రులతో నితీష్ దశాబ్దాలుగా పనిచేశారు. ఇపుడు కొడుకులతో యుధ్ధం చేయడం నితీష్ కి కొత్త అనుభవం. అయితే జనాలు ఏమనుకుంటున్నారు అన్న దాని మీద ఎన్నో సర్వేలు వచ్చాయి.

తాజాగా సీ ఓటర్ సర్వే చూస్తే బీహార్ లో మరో మారు నితీష్ జెండా ఎగురవేయడం  ఖాయమని అంటున్నారు. నితీష్ కి జనాదరణలో తిరుగులేదని ఆ సర్వే ఫలితాలు చాటి చెప్పాయి. అంతే కాదు. ఆయన సరిసాటి నేత ఎవరూ ప్రత్యర్ధిగా లేకపోవడం కూడా అయనకు ప్లస్ పాయింట్ గా ఉందని అంటున్నారు. ఇక లాలూ వారసుడిగా దూసుకువస్తున్న తేజశ్వి యాదవ్ తన కూటమికి ఈసారి మెరుగైన ఫలితాలు రాబడతారు కానీ అధికార పీఠానికి ఆమడదూరంలోనే ఆయన ఉండిపోతారని సర్వే చెబుతోంది. ఇంకో వైపు చూసుకుంటే ఇటీవల మృతి చెందిన దళిత నేత, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీకి ఒకటి నుంచి అయిదు సీట్లు మాత్రమే వస్తాయట. ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ని జనం ఆదరించలేదు అంటున్నారు.

ఆర్జేడీ కూటమికి వంద లోపు సీట్లు వస్తే 140 లోపు సీట్లు నితీష్ నాయకత్వంలోని జేడీయూ కూటమికి దక్కుతాయని అంటున్నారు. అంటే నితీష్ హ్యాపీగా నాలుగవసారి సీఎం కుర్చీ ఎక్కడానికి రెడీ అయిపోవచ్చునని అంటున్నారు. ఇంకో వైపు చూసుకుంటే బీజేపీ మోడీ ప్రభావం కూడా ఈసారి ఎన్నికల్లో బాగానే  పనిచేస్తోందని చెబుతున్నారు. మొత్తానికి ఈసారి కూడా గెలిస్తే రెండు దశాబ్దాల కాలం బీహార్ సీఎం గా పనిచేసిన సరికొత్త రికార్డుని నితీష్ సొంతం చేసుకుంటారు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: