దేశంలో మారుతున్న రాజకీయాన్ని బట్టి ముందుకు సాగడం రాజకీయ నాయకుని ప్రాధమిక  లక్షణం. రాజకీయాల్లో సెంటిమెంట్లు అసలు ఉండవు. ఇక్కడ ఉండేవి ఎపుడూ సమీకరణలు. అంటే లెక్కలన్నమాట. ఇపుడు ఏపీ ఎన్నో ఇబ్బందులు పడుతోంది. అలా ఇలా కాదు అప్పుల కుప్ప అంటే ఏపీయేనని చెప్పాలి.ఈ సమయంలో కేంద్రం ఉదారంగా సాయం చేయడం మాట అటుంచి  కటింగుల మీద కటింగులు పెడుతోంది. పోలవరం బడ్జెట్ విషయంలో తాజాగా బిగ్ బాంబు పేల్చిన కేంద్రం వైఖరి ఏపీ రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజలను కూడా ఆశ్చర్యంలో పడవేశాయి. అయితే కేంద్రంలో మోడీ సర్కార్ కి ఫుల్ మెజారిటీ ఉందని మన అవసరం లేదని ఏపీలో గెలిచిన తరువాత ఢిల్లీ వెళ్ళి అన్న మాటలు అందరికీ గుర్తుంటాయి.

అయితే ఆ రోజులు పోయాయి. కేంద్రంలో మోడీకి రాజ్యసభలో నాడూ నేడూ కూడా మద్దతు లేదు. కేవలం ఇద్దరు సభ్యుల నుంచి ఆరుగురు ఎంపీల దాకా బలం పెంచుకున్న జగన్ గట్టిగా సౌండ్ చేసి బెట్టు చేస్తే మోడీ సర్కార్ తలవొగ్గక తప్పదు అంటున్నారు. ఏపీలో ఉన్న పరిస్థితుల నేపధ్యంలో జగన్ బేషరతుగా కేంద్రం బిల్లులకు మద్దతు ప్రకటించకుండా డిమాండ్లు ముందు పెట్టాల్సిన తరుణం ఇదేనని కూడా పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.

పోలవరానికి అడ్డగోలుగా నిధులు కట్ చేసిన కేంద్రం మీద జగన్ సమరం ప్రకటించడం కంటే లౌక్యంగా ఒడుపుగా నరుక్కురావాలని కూడా కోరుతున్నారు. ఇక రాజ్యసభలో ఎటూ వైసీపీ మద్దతు అవసరం ఉంది. గత నెల రోజుల తేడాలో మూడు పార్టీలు మోడీ సర్కార్ కి రాం రాం చెప్పేశాయి. ఎన్డీయేలో బీజేపీ తప్ప మరే పెద్ద పార్టీ లేదు. రానున్న రోజులు కూడా బీజేపీకి, మోడీకి కొంత ఇబ్బందిని కలిగించేవేనని అంటున్నారు.

మరి ఏపీ ప్రజల ప్రత్యేక హోదాను తుంగలోకి తొక్కేసిన కేంద్రం ఇపుడు ఏపీకి జీవనాడి లాంటి పోలవరం విషయంలో కూడా అడ్డం తిరగడాన్ని ఎవరూ సహించలేకపోతున్నారు. మోడీకి, బీజేపీకి మిత్రులు కావాలి. మరి మెత్తగా మిత్రుడిగా ఉంటాడు అనే ఏపీని, జగన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది అని అంటున్నారు. దానికి తగిన జవాబుగా జగన్ చాణక్య రాజకీయం చేయాలని, మోడీని తన వైపునకు తిప్పుకోవాలని సూచిస్తున్నారు. తొందరలోనే ఢిల్లీ టూర్ పెట్టుకున్న జగన్ ఆ దిశగా కార్యాచరణతో దిగితే ఆయన సూపర్ సక్సెస్ అవుతారని అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: