సరిహద్దుల్లో చైనాతో నెలకున్న ఉద్రిక్తతలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయదశమి సందర్భంగా ఆర్ఎస్ఎస్ వార్షిక ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. శక్తిసామర్థ్యాల పరంగా చైనాను భారత్‌ మించిపోవాల్సిన అవసరం ఉందని అన్నారు. చైనాతో నెలకున్న ఘర్షణ నేపథ్యంలో సైన్యం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చైనా సహా చాలా దేశాలు విస్తరణ కాంక్షతో రగిలిపోతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు.

‘ఇటీవల సరిహద్దుల్లో చోటుచేసుకున్న పరిణామాలపై భారత్ అంత వేగంగా స్పందిస్తుందని చైనా ఊహించి ఉండదు.. భారత సైన్యం స్పందించిన తీరుతో డ్రాగన్ అవాక్కయ్యింది. శక్తి సామర్థ్యాల పరంగా చైనాను మించిపోవాల్సిన అవసరముంది.. కరోనా విపత్కర సమయంలో భారత్‌లోకి చొరబాటుకు చైనా ప్రయత్నించింది. చైనా విస్తరణవాద కాంక్ష గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు’అని మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు. అందరితోనూ స్నేహపూర్వకంగా మెలగాలని భారత్ కోరుకుంటోందని, అది తమ స్వభావమని, ఈ మంచితనాన్ని బలహీనతగా భావించి దురాక్రమణకు ప్రయత్నిస్తే చేతులు ముడుచుకుని కూర్చోబోమని, ఒకవేళ అలా చేస్తే ప్రస్తుత పరిణామాలే ఎదురవుతాయని పరోక్షంగా చైనాను హెచ్చరించారు. కొందరు సీఏఏపై మాట్లాడుతున్నారని.. అది కేవలం ఏదో ఒక మతాన్ని ప్రభావితం చేసేది కాదని విమర్శలు గుప్పించారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిపై చర్చించే బదులు దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న కరోనా వ్యాప్తిని ఎలా నివారించాలన్నదానిపై మాట్లాడుకుంటే మంచిదని హితవు పలికారు. కరోనా వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా వ్యవహరించాలని మోహన్‌ భగవత్‌ అన్నారు. భారత భూభాగం నుంచి చైనా ఎప్పుడు వెనక్కు వెళుతుందో చెప్పాలని కాంగ్రెస్, రాహుల్ గాంధీ పలు సందర్భాల్లో కేంద్రాన్ని ప్రశ్నిస్తోన్న విషయం విదితమే. చైనా మహ భూభాగాన్ని ఆక్రమించుకుంది.. దానిని భారత ప్రభుత్వం ఎప్పుడు వెనక్కు తీసుకుంటుందో ఖచ్చితంగా చెప్పాలి? లేదా దేవుడి మీద భారం వేసి వదిలేస్తారా? అని రాహుల్ ఇటీవల ట్విట్టర్‌లో కేంద్రంపై రాహుల్ విరుచుకుపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: