మహేంద్ర సింగ్‌ ధోనీ.. భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన కెప్టెన్‌. టీ20 వరల్డ్‌ కప్‌, వన్డే వరల్డ్‌కప్‌లు అందించాడు. అలాగే చెన్నై సూపర్‌ కింగ్స్‌ను మూడుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతను ఎన్ని విజయాలు అందించాడో లెక్కేలేదు. ధోనీ.. క్రీజ్‌లో ఉన్నాడంటే - ఎంత పెద్ద టార్గెట్‌ అయినా తక్కువే. చివరి వరకూ క్రీజ్‌లో ఉండి.. జట్టుకు విజయాలు అందిస్తాడు. ధాటిగా ఆడటంలోనైనా.. వికెట్ల మధ్య పరిగెత్తడంలోనైనా.. అతనికి అతనే సాటి. మహేంద్ర సింగ్‌ ధోనీ.. ది బెస్ట్‌ ఫినిషర్‌. క్రీజ్‌లో అతను ఉన్నాడంటే.. గెలుపుపై ఒక ధీమా. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు సీన్ మారిపోయింది.


రిటైర్మంట్‌ ప్రకటించిన తర్వాత ఐపీఎల్లో ఆడుతుండటంతో.. అందరి దృష్టి ధోనీపైనే ఉంది. అతని ఆటతీరును ఆస్వాదించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ధోనీ ఆటతీరు మాత్రం అభిమానుల్ని సంతృప్తిపరచలేకపోయింది. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో డకౌట్‌ అయిన ధోనీ.. ఆ తర్వాత కొద్దో, గొప్పో పరుగులు సాధిస్తున్నా.. జట్టును మాత్రం గెలిపించలేకపోతున్నాడు. భారీషాట్ లను అలవోకగా ఆడే జార్ఖండ్‌ డైనమేట్.. ఇప్పుడు పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతున్నాడు. వికెట్ల మధ్య పరుగెత్తడంలోనూ మునపటి వేగం కనిపించడంలేదు.


దాదాపు ఏడాదిగా క్రికెట్‌కు దూరమవడంతో.. మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేక ధోనీ సరిగా ఆడలేకపోతున్నాడని అనుకున్నారు. అయితే ఐపీఎల్లో నాలుగు మ్యాచ్‌ల తర్వాత కూడా ధోనీ.. తన మార్క్‌ ఆటతీరును అందుకోలేకపోతున్నాడు. గతంలో చివరివరకూ అతను క్రీజ్‌లో ఉంటే చాలు.. గెలుపు తానంతట అది వచ్చేస్తుందనే భరోసా ఉండేది. ఇప్పుడు ధోనీ చివరి వరకు నాటౌట్‌గా ఉంటున్నాడు కానీ.. సాధించాల్సిన రన్‌రేట్‌ను మాత్రం చేరుకోలేకపోతున్నాడు. ఏదో నామ్‌ కే వాస్తేగా.. జట్టు ఓటమి ఖరారయ్యాక.. బాదేస్తున్నాడు. సునాయాసంగా హెలికాఫ్టర్‌ షాట్స్‌ కొట్టే ధోనీ.. ఇప్పుడు సిక్సులు కొట్టడానికి ఆపసోపాలు పడుతున్నాడు. జట్టును గెలిపించాలన్న కసి కనిపించడంలేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు.


ఇక కెప్టెన్సీపరంగా కూడా ధోనీ తీసుకుంటున్న నిర్ణయాలు కలిసిరావడంలేదు. బ్యాటింగ్‌ ఆర్డర్లో మార్పులు, టీమ్‌ను యాక్టివ్‌గా ఉంచడంలో ధోనీ విఫలమవుతున్నాడనే విమర్శలూ వినిపిస్తున్నాయి. పాయింట్స్‌ టేబుల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరో స్థానంలో నిలిచింది. ధోనీ ఆట చూస్తుంటే అతడికి ఇదే లాస్ట్‌ ఐపీఎల్‌ అన్పిస్తోంది. ఇక ధోనీనీ నెక్ట్స్‌ సీజన్‌లో చూడటం కష్టమన్న వాదనలు విన్పిస్తున్నాయ్.   మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకోనున్నాడా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.  తన జెర్సీలను ఆటగాళ్లకు గిఫ్ట్‌గా ఇస్తున్నాడు ధోనీ .అంతేకాదు ఈ సీజన్‌లో పలువురు క్రికెటర్లు ధోని ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం చూస్తుంటే.. సీఎస్‌కే సారధికి ఇదే చివరి సీజన్ కావొచ్చునని ఫ్యాన్స్‌లో అనుమానాలు కలుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: