అంతర్జాతీయ క్రికెట్లో ఎంతోమంది ఎన్నో విధాలుగా తమదైన ముద్ర వేశారు. పరుగులు చేయడంలో బ్యాట్స్‌మన్‌, బంతులు విసరడంలో బౌలర్లు రికార్డులు కొల్లగొట్టారు. ఇక ఆల్‌రౌండర్లు రెండింట్లోనూ రాణిస్తారు.  కొందరు మాత్రమే నాయకత్వంలో మెరుస్తారు. కానీ  కపిల్‌దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ అందరికీ భిన్నంగా రాణించారు.

భారత క్రికెట్‌ చరిత్రలో రియల్ లగాన్ 1983 వరల్డ్‌కప్‌ విజయంతోనే మొదలైంది. ఇంగ్లండ్ గడ్డ మీద కపిల్ డెవిల్స్ సృష్టించిన క్రికెట్ ప్రభంజనం గురించి ఎవరూ మర్చిపోరు. పసికూనలాంటి టీమ్ వరల్డ్‌కప్‌ గెలవగలదా అన్న మిలియన్ల కొద్దీ  ప్రశ్నలకు జవాబిచ్చింది కపిల్ సేన. ఉపఖండంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా,ఎలాంటి పిచ్‌లపై  అయినా,భారత్ గెలవగలదని నిరూపించింది. నిజానికి భారత క్రికెట్ లో అసలు సిసలైన మెరుపులు 1983 నుంచే మొదలయ్యాయి. ఆ మెరుపులకు కారణం హర్యానా హరికేన్ కపిల్ దేవ్. ఈ సూపర్ హీరో అసలు పేరు కపిల్ దేవ్ రాంలాల్ నిఖంజ్.  ఆ తర్వాత భారత క్రికెట్ కొన్నేళ్లు మెరుపులు మెరిసినా మళ్లీ 90వ దశకంలో మసకబారింది.

1983 తర్వాత మరో 28 ఏళ్లకు కానీ టీమిండియా వరల్డ్‌కప్ అందుకోలేదు. మిస్టర్ కూల్ కెప్టెన్సీలో 2011లో టీమిండియా రెండో వరల్డ్‌కప్ వచ్చింది. యువకులతో దక్షిణాఫ్రికాకు వెళ్లి తొలి టీ20 ప్రపంచకప్‌ ముద్దాడింది ధోనీ కెప్టెన్సీలోనే.  సొంతగడ్డ మీద శ్రీలంకపై ఫైనల్లో 91 నాటౌట్‌తో చెలరేగి 28 ఏళ్ల వన్డే ప్రపంచకప్‌ కల నిజం చేశాడు మహేంద్రుడు.

కపిల్ దేవ్, ధోనీలకు ఎన్నో పోలీకలు ఉన్నాయ్.  మ్యాచ్‌ పరిస్థితులను అధ్యయనం చేయడంలో ఈ ఇద్దరు దిట్ట.   ప్రత్యర్థి చేత ఎలాంటి ఎత్తులు వేయించి ఓడించాలో ముందే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఆటలో ఎప్పుడేం చేయాలో ఈ ఇద్దరికి తెలిసినంతగా భారత క్రికెట్‌లో ఎవరికి ఏం తెలియదన్నది నిజం.   క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్‌ను ఎలా బోల్తా కొట్టించాలో, బౌలర్‌పై ఎలా ఒత్తిడి పెంచాలో తెలుసు. ఇద్దరు ఫినిషర్లుగా దిగి భారత క్రికెట్‌కు ఎన్నో మరుపురాని విజయాలను అందించారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: