ఏపీలో సీఎంఓకు.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి పొసగడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహరం ఎప్పుడైతే తెర మీదకు వచ్చిందో.. అప్పటి నుంచి సీఎం వర్సెస్‌ ఎస్ఈసీ అన్నట్టుగా మారింది వ్యవహరం. సీఎంతో కానీ అధికారులతో కానీ ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ ఏకపక్షంగా వ్యవహరం నడుపుతున్నారనే విమర్శలు అధికార పార్టీ వైపు నుంచి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తిరిగి స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించే దిశగా కసరత్తు చేస్తున్న సమయంలో ఎస్‌ఈసీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ చేస్తున్నవన్నీ తప్పిదాలని ప్రభుత్వం ఓవైపు దాడి చేస్తుంటే.. టీడీపీ ఆయనకు సపోర్ట్‌ చేస్తున్న పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఓవైపు ఈ వివాదాలు.. ఈ విమర్శలు కొనసాగుతుండగానే.. మరో వివాదం తెర మీదకు వచ్చింది. ఓ చిన్నపాటి ఎస్సెమ్మెస్‌ వివాదం రాజకీయ-పరిపాలన వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.

రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న తనను ఈ తరహాలో సమావేశానికి రావాల్సిందిగా ఎలా మెసేజ్‌ ఇస్తారంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మండిపడ్డారు. తనకు మెసేజ్‌ ఇచ్చిన సీఎంవో ముఖ్య కార్యదర్శికి.. తన పేషీ నుంచి రిప్లై ఇప్పించారు. హైకోర్టు జస్టిస్ హోదాలో ఉన్న తనతో ఈ విధంగా వ్యవహరిస్తారా అంటూ ఆ మెసేజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. దీంతో ఈ మెసేజ్‌ ఎస్ఈసీ సెక్రటరీకి పంపబోయి పొరపాటున ఎస్ఈసీకి పంపామన్న విషయాన్ని  ప్రవీణ్ ప్రకాష్ కార్యాలయం నుంచి వివరణ ఇచ్చారు.  అయినా వెనక్కి తగ్గని  నిమ్మగడ్డ  తన అనుమతి లేకుండా ఎన్నికల నిర్వహాణ విషయమై జరిగే సమావేశాలకు హాజరు కావొద్దంటూ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు.

అసలే సీఎంఓకు.. ఎస్‌ఈసీకి మధ్య కోల్డ్‌ వార్‌ జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ వివాదం సరికొత్త డిస్కషన్‌కు తెర తీసింది. ఎస్‌ఈసీ చెప్పినట్టు ఈ వ్యవహరాన్ని కోర్టు దాకా తీసుకెళ్తారా..? లేదా అనేది హాట్‌టాపిక్ గా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: