వైజాగ్: విశాఖపట్టణంలో గీతం కట్టడాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు స్టేటస్‌ కో ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేతల వ్యవహారంలో సోమవారం వరకు తదుపరి చర్యలు నిలపాలని న్యాయస్థానం ఆ ఆదేశాల్లో పేర్కొంది. గీతం కట్టడాల కూల్చివేతపై ఆ యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ చర్యలను ఆపాలని హైకోర్టులో హౌస్‍మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ముందస్తు నోటీసు ఇవ్వకుండా యూనివర్సిటీ నిర్మాణాలను అక్రమంగా కూల్చివేస్తున్నారని ఆ పిటిషన్‍లో పేర్కొంది. క్రమబద్ధీకరణ ప్రక్రియ పెండింగ్‍లో ఉండగా నిర్మాణాలను కూల్చివేస్తున్నారన్న ఆరోపించింది. నేడు దీనిపై న్యాయస్థానంలో పూర్తిస్థాయిలో విచారణ జరగనుంది. కాగా.. విశాఖ గీతం యూనివర్సిటీలోని కొన్ని కట్టడాలను రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు. ప్రభుత్వ భూములు అక్రమించి ఈ నిర్మాణాలు చేపట్టారని.. యూనివర్సిటీ ప్రహరీ గోడ, ప్రధాన ద్వారాన్ని అధికారులు కూలగొట్టారు. ఈ క్రమంలో యూనివర్సిటీ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు.

కూల్చివేత బీచ్ రోడ్డు మీదుగా యూనివర్సిటీ వైపు వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు. యూనివర్సిటీ పరిసరాల్లోకి అధికారులు ఎవరిని అనుమతించడం లేదు. అయితే నోటీసులు ఇవ్వకుండానే అధికారులు నిర్మాణాలను కూల్చివేస్తున్నారని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆరోపిస్తుంది. ముందస్తు సమాచారం లేకుండా ఈ విధంగా చేయడం సరైనది కాదని పేర్కొంది. ఇందుకు సంబంధించి న్యాయపరమైన అంశాలు కోర్టులో ఉన్నాయని తెలిపింది. అయితే రిషికొండ, ఎండాడ పరిధిలో 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీ అక్రమించినట్టుగా విచారణలో తేలిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే శనివారం ఉదయం నుంచి ఆర్డీవో కిషోర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ విధానం మేరకు అక్రమణల తొలగింపు చేపట్టామని అన్నారు. ఇప్పటికి ప్రహరీ గోడ, ప్రధాన గోడ కూల్చివేశామని ఆర్డీవో కిషోర్ తెలిపారు. అక్రమణలో ఉన్న మరికొన్ని కట్టడాలను గుర్తించామని.. తదుపరి దశలో వాటిని కూల్చివేస్తామని చెప్పారు. అక్రమణల కూల్చివేతపై యజమాన్యానికి పూర్తి సమాచారం ఉందన్నారు. ఇక, సినీ నటుడు బాలకృష్ణ చిన్నఅల్లుడు, టీడీపీ నేత అయిన శ్రీ భరత్ గీతం వర్సిటీ చైర్మన్‌గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: