అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చే నిధుల్లో కేంద్రం భారీ ఎత్తున కోత విధించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సవరించిన డీపీఆర్‌ను ఆమోదించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తుంటే.. కేంద్రం మాత్రం పాత అంచనాలనే ఆమోదిస్తామని చెబుతున్నట్టు సమాచారం. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 20,389.61 కోట్లు మాత్రమేనని చెబుతున్న కేంద్రం.. ఇప్పటికే ఇచ్చిన నిధుల్ని మినహాయిస్తే ఇక ఇవ్వాల్సింది రూ. 4819.47 కోట్లు రూపాయలు మాత్రమేనని చెబుతోంది. దీనిపై ఏపీ సర్కార్‌ ఆమోదం తీసుకోవాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కేంద్రం ఆదేశించినట్లు సమాచారం. కేంద్రం ఈరకమైన వైఖరిలో ఉండటంతో.. ఏం చేయాలనే దానిపై ఏపీ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. దీనిపై ఏపీ సీఎం జగన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. నిధులకు సంబంధించిన తాజా పరిణామాలపై మంత్రులు, ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి నీటి పారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హాజరయ్యారు.

ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను షరతులు లేకుండా వెంటనే చెల్లించాలని కోరారు. త్వరితగతిన రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్రం పోలవరం ప్రాజెక్టు విషయంలో పాత అంచనాల ఆధారంగానే నిధులు ఇస్తామని చెబుతుండటంతో.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు సహాయ పునరావాసం కల్పించడానికే రూ.29 వేల కోట్లు వ్యయం అవుతుందని పీపీఏ, సీడబ్ల్యూసీ, ఆర్‌సీసీ, కేంద్ర జల్‌ శక్తి శాఖ అంచనా వేసి.. ఆమోదించాయని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. కానీ ఈ ప్యాకేజీకి రూ.20,398.61 కోట్లు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ చెప్పడం సమంజసం కాదన్నారు.

ఆ నిధులతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని అన్నారు. 2016 సెప్టెంబర్‌లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో జరిపిన అంతర్గత చర్చల్లో.. పోలవరం ప్రాజెక్టుకు ఏప్రిల్‌ 1, 2014 నాటి ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని కేంద్రం పేర్కొన్న అంశాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. ఏప్రిల్, 1, 2014 నాటి ధరల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే మంజూరు చేస్తామంటూ 2017 మార్చిలో కేంద్ర కేబినెట్‌ తీర్మానం చేసిందని ఎత్తిచూపారు. ఈ విధంగా పోలవరం ప్రాజెక్టుకు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుంటే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అప్పట్లో తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు వర్తింపజేస్తామనడం సమంజసం కాదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: