బొబ్బిలి రాజు గారు ఏంటి ఇంత సైలెంట్ అయ్యారు..??


వైకుంఠపాళి ఆట గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చిన్న పిల్లలకు సరదానిచ్చే ఈ ఆట పెద్దలకు జీవిత పాఠం బోధిస్తుంది. జీవితం అనే వైకుంఠపాళిలో నిచ్చెనలు అందలం ఎక్కిస్తే.. కాటేసే పాములు జీవితంపై దెబ్బ కొట్టేవిగా ఉంటాయి. ఈ వైకుంఠపాళి ఆటకు.. సరిగ్గా సరిపోయే రంగం ‘రాజకీయం’. ఎప్పుడు గెలుపు వస్తుందో, ఓటమి వస్తుందో తెలీదు. ఈ ఉదాహరణ ఎందుకంటే.. రాజకీయంగా బలమైన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, వరుస విజయాల రికార్డు ఉన్న ఓ ప్రజాప్రతినిధి తాను స్వయంగా చేసిన పని స్వయంకృతాపరాధంగా మారింది. ఆయనే.. సుజయ్ కృష్ణ రంగారావు. విజయనగరం జిల్లాలో ఆర్ధికపుష్టి, రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. కానీ.. ప్రస్తుతం ఆయన సైలెంట్ అయిపోయారు.సుజయ్ కృష్ణ తాతగారు రామకృష్ణ రంగారావు మద్రాస్ ప్రెసిడెన్సీకి రెండుసార్లు ముఖ్యమంత్రి. తండ్రి గోపాలకృష్ణ రంగారావు మూడో లోక్ సభకు ఎంపీ. వీరి వారసుడిగా సుజయ్..

బొబ్బిలి నుంచి 2004, 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే.. 2017లో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మంత్రి పదవీ.. ఇచ్చారు చంద్రబాబు. అయితే.. ప్రస్తుతం ఆయన్ను పట్టించుకునే వారు లేరు. మంత్రిగా సత్తా చాటుకోలేకపోవడం, నియోజకవర్గ ప్రజలకు దూరమవడం, చంద్రబాబు తీరు.. వంటి కారణాలతో ఆయన ప్రభ కోల్పోయారు. ఇటివలే టీడీపీ కట్టబెట్టిన పదవుల్లో.. అప్పట్లో పార్టీ మారి వచ్చిన వారికి అతి తక్కువగా ఇచ్చారు. వీరిలో సుజయ్ లేరు.2014లో వైసీపీ నుంచి గెలిచి 2017లో పార్టీకి రాజీనామా చేశారు. తీరా చూస్తే.. 2019లో అదే వైసీపీ అప్రతిహత విజయంతో అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు సొంత గూటికి వెళ్లలేక, టీడీపీలో ఉండాలో లేదో తెలీక సుజయ్ రంగారావు పరిస్థితి రాజకీయంగా అగమ్యగోచరంగా ఉంది. వ్యక్తిగత ఇమేజ్ తప్పించి రాజకీయంగా ప్రస్తుతానికి బలం లేదనే చెప్పాలి. కొత్తగా వచ్చిన వారిని చంద్రబాబు ప్రస్తుతం పట్టించుకునే స్థితిలో లేరు. ‘అప్పట్లో మంత్రి పదవే ఇచ్చాం కదా..’ అనే ధోరణి తప్పించి భరోసా ఇస్తున్న సూచనలు లేవు. మరి.. సుజయ్ కృష్ణ రంగారావు భవిష్యత్ రాజకీయ పయనం ఎటో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: