బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ పార్టీ నేతలపై పల్లెత్తు మాట పడనిచ్చేవారు కాదు పవన్ కల్యాణ్. కేంద్రంలో మోదీ ఏ నిర్ణయం తీసుకున్న శెహభాష్ అంటూ చప్పట్లు కొట్టేవారు. కరోనా టైమ్ లో కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను పూర్తిగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు కృషిచేశారు పవన్ కల్యాణ్. ఇటు రాష్ట్రంలో కూడా బీజేపీ నేతలతో సయోధ్యగానే ఉన్నారు. కలసి కార్యక్రమాలు చేశారు, ఆందోళనల్లో పాల్గొన్నారు. కొత్తగా పదవులు వచ్చినవారికి శుభాకాంక్షలు చెప్పారు కూడా. అంతా బాగానే ఉంది కానీ.. ఏపీలో నూతన బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మాత్రం పవన్ కల్యాణ్ ని పిలవకుండా బీజేపీ నేతలు ఘోరంగా అవమానించారనేది తాజా కలకలం.

అవును.. విజయవాడలో బీజేపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. నాయకులు అందరూ హాజరయ్యారు. కనీసం మిత్ర పక్షానికి ఓ ఆహ్వానం కూడా పంపలేదట. పోనీ పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో చాతుర్మాస దీక్షలో ఉన్నారు, ఆయన రాలేరు అనుకున్నా.. రాష్ట్ర స్థాయిలో కూడా ఎవ్వరికీ ఆహ్వానాలు అందలేదట. దీంతో జనసేన పార్టీ నేతలు కాస్త కినుక వహించారని తెలుస్తోంది.
ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు బీజేపీ, జనసేన మధ్య దూరాన్ని పెంచుతున్నాయని అంటున్నారు. కేంద్ర నాయకత్వం సీఎం జగన్ తో సఖ్యతగా ఉండటం పవన్ కి నచ్చడంలేదని, అందుకే ఆయన ఇటీవల బీజేపీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే బీజేపీ అధినాయకత్వం కూడా పవన్ ని కావాలనే పట్టించుకోవడంలేదని, విజయవాడలో జరిగిన పార్టీ కార్యక్రమానికి కనీసం మిత్ర పక్షం అనే మర్యాదకూడా ఇవ్వకుండా జనసేనను పిలవలేదని అంటున్నారు. అయితే ఇది పూర్తిగా బీజేపీ వ్యవహారం కాబట్టి.. ఇతర పార్టీల నేతలు అక్కడికి ఎందుకెళ్తారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కేవలం పార్టీ వ్యవహారం కాబట్టి జనసేనకు ఆహ్వానం అందలేదని సర్ది చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: