కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏపీ సర్కారుకు ఝలక్ ఇచ్చింది. పోలవరం నిధుల విషయంలో కోత విధించేందుకు ప్రయత్నిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో అంచనాలు తగ్గిస్తూ నిధులు తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా భూ సేకరణ ,నిర్వాసితులకు పునరావాసం తదితర వ్యయాలపై కేంద్రం మొండి చెయ్యి చూపిస్తుండడం ఏపీ సర్కారుకు ఇబ్బందిగా మారింది. అసలే జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు జోరు తగ్గిందని విపక్షాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి.

ఇలాంటి సమయంలో కేంద్రం ఇలాంటి ప్రయత్నాలు చేయడం నిజంగా జగన్ కు ఓ షాక్ అనే చెప్పాలి. అయితే ఇదంతా చంద్రబాబు హయాంలో చేసిన పొరపాట్ల కారణంగానే అంటూ వైసీపీ ఎంత కవర్ చేసుకున్నా.. ఇప్పుడు మరి మీరేం చేస్తున్నారన్న ప్రశ్నలు ఉదయిస్తాయి. అందుకే ఈ విషయంలో అసంతృఫ్తి వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లకు ముఖ్యమంత్రి జగన్ లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014లో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. వంద శాతం ఖర్చుతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన అంశాన్ని గుర్తు చేశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని పూర్తిగా భరించి.. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని 2014లోనే కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న విషయాన్ని జగన్ తన లేఖల్లో ప్రస్తావించారు. విభజన చట్టం, కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కావాలంటే కేంద్రమే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి పూర్తి చేయవచ్చని కూడా జగన్ ఆ లేఖల్లో రాసినట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు సహాయ పునరావాసం కల్పించడానికే రూ.29 వేల కోట్లు వ్యయం అవుతుందని పీపీఏ, సీడబ్ల్యూసీ, ఆర్‌సీసీ, కేంద్ర జల్‌ శక్తి శాఖ అంచనా వేశాయి. ఈ మేరకు ఆమోదం కూడా తెలిపాయి.

కానీ ఇప్పుడు కేంద్రం మాత్రం ఈ ప్యాకేజీకి రూ.20,398.61 కోట్లు మాత్రమే ఇస్తామని చెబుతోంది. ఆ నిధులతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యం.  2016 సెప్టెంబర్‌లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో జరిపిన అంతర్గత చర్చల్లో.. పోలవరం ప్రాజెక్టుకు ఏప్రిల్‌ 1, 2014 నాటి ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని కేంద్రం పేర్కొందని జగన్ అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుంటే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించదన్నది జగన్ వాదన. అయితే ఇప్పుడు జగన్ సర్కారు ఏ విధంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తుంది.. నిధుల్లో కోతపడకుండా చూస్తుందన్నది జగన్ సత్తాపై ఆధారపడి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: