జగన్ వరసపెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిజానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రిస్క్ చేయాలి. మరి కొన్ని రాజకీయ మొహమాటాలతో ముడిపడి ఉంటాయి. ఇంకొన్ని రాజ్యాంగబద్ధమైన ఆబ్లిగేషన్స్ తో ముడిపడి ఉంటాయి. అయితే పాలకుడు దూకుడుగా ముందుకు సాగితే ఏ నిర్ణయం అయినా అంతే వేగంగా వెలువడుతుంది అనడానికి జగన్ పాలన ఒక నిదర్శనం. జగన్ ఏపీలో అనేక కీలకమైన నిర్ణయాలను ఇంతవరకూ చాలానే తీసుకున్నారు. ఇపుడు కూడా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారా అన్నది చర్చగా ఉంది.

పోలవరం ప్రాజెక్ట్ విషయంలోనే జగన్ ఆ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తాజాగా మంత్రులు అధికారులతో జగన్ పోలవరం గురించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ చేసినట్లుగా ప్రచారంలోకి వచ్చిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలను గమనిస్తే జగన్ ఏం ఆలోచిస్తున్నారో అర్ధమవుతుంది అంటున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఏమీ సంబంధం లేదని జగన్ అన్నట్లుగా తెలుస్తోంది.

ఆనాడు చంద్రబాబు రాష్ట్రం స్వీయ నిర్వహణలో పోలవరం ప్రాజెక్ట్ ఉండాలని భావించి తీసుకున్నారని ఇప్పటికే ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాంట్రాక్టుల కోసమే ఆయన ఈ విధంగా చేశారని మంత్రి ఆరోపించారు. మరో వైపు చూసుకుంటే ప్రత్యేక హోదాను సైతం తాకట్టు పెట్టి పోలవరం కాట్రాక్టుల కోసం టీడీపీ పెద్దలు పట్టుపట్టారని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. ఏదేమైనా తమకు ప్రాజెక్ట్ పూర్తి అయితే చాలు అన్నది వైసీపీ విధానంగా ఉంది.

ఇదిలా ఉంటే ఇది కేంద్ర ప్రాజెక్ట్, బాధ్యత కూడా వారిదేనని జగన్ అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ బాధ్యత కేవలం పర్యవేక్షణకే పరిమితం అని కూడా ఆయన పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే పోలవరం నిధుల విషయంలో సగానికి పైగా కటింగులు చేస్తూ కొర్రీలు పెడుతున్న కేంద్రానికి గట్టి ఝలక్ వైసీపీ సర్కార్ ఇచ్చేలా ఉందట. పోలవరం  నిర్మాణ నిర్వహణ బాధ్యతల నుంచి అవసరమైతే తప్పుకుని మరీ కేంద్రం చేతిలో పెట్టేందుకు జగన్ రెడీ అవుతున్నారని అంటున్నారు. ఇకపైన నిధుల గురించి పదే పదే అడగడం, కేంద్రం ఏవో లెక్కలు చూపించడం ఈ తలకాయ నొప్పి ఎందుకు వారినే పూర్తి చేయమంటే పోయేదిగా అన్నట్లుగా వైసీపీ ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు చూడాలి మరి ఏమి జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: