ప్రతీ సంవత్సరం జిల్లాలోని దేవరగట్టులో జరిగే కర్రల సమరం రద్దు అయ్యింది. కరోనా కారణంగా కర్రల యుద్ధం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అయితే కర్రల సమరం నిర్వహిస్తామని యువకులు చెబుతున్నారు. కాగా దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.  అలూరు, హోలగొంద, హాలహర్వి మండలాలకు తిరిగే కర్ణాటక ఆర్టీసీ బస్సు సర్వీసులను ఈరోజు సాయంత్రం వరకు రద్దు చేశారు. అయితే, బన్నీ ఉత్సవాన్ని పోలీసులు రద్దు చేసినా… సంప్రదాయం కొనసాగించాల్సిందే అంటూ నిర్వాహకులు పట్టుబడుతున్నారు. దీంతో దేవరగట్టులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. అయితే స్వామి వారి పూజా కార్యక్రమాలు మాత్రం యధాతథంగా కొనసాగుతాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా పండుగను కుటుంబ సభ్యులతో ఇళ్లలోనే జరుపుకోవాలని సూచిస్తున్నారు. దేవరగట్టుకు బయటి వ్యక్తులకుప్ర‌వేశం లేద‌ని అధికారులు చెబుతున్నారు. దేవరగట్టులో పూజా కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు.


అయితే దేవరగట్టు పరిసర గ్రామాల్లో మద్యం అమ్మకాలను నిషేధించారు. ఈరోజు అర్ధరాత్రి మాలమల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం జరుగనుంది. మరోవైపు దేవరగట్టులో కర్రల సమరం రద్దు  నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది పోలీసులు దేవరగట్టు విధుల్లో ఉన్నారు. దేవరగట్టు ఆలయ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్, ఫాల్కాన్ వాహనాలతో నిఘా నిర్వహిస్తున్నారు.  మంత్రి జయరాంతో ఆదోని డీఎస్పీ, ఆర్డీవో భేటీ అయ్యారు. ఇవాళ జరిగే దేవరగట్టు కర్రల సమరంపై చర్చించారు. కర్రల సమరం జరగకుండా నియోజకవర్గ ప్రజలకు నచ్చచెప్పాలని మంత్రి జయరాంను కోరారు.


లక్షల మంది జనం కలిస్తే మళ్లీ కరోనా విజృంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దసరా వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి కర్నూలు జిల్లా వైపే ఉంటుంది. ఎందుకంటే దసరా పండుగ సందర్భంగా జిల్లాలోని దేవరగట్టు కొండ దగ్గర బన్నీ ఉత్సవం రణరంగం తలపిస్తుంది. ఈ ఉత్సవంలో కర్రలతో ఒకరినొకరు బాదుకుంటూ ఆ ప్రాంతం రక్తసిక్తమవుతుంది. అక్టోబర్‌ 21 నుంచి 30 వరకు బన్నీ ఉత్సవాలను నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ జాత‌ర‌కు ఏళ్ల చ‌రిత్ర ఉంది. అయితే ఈ ఏడాది దేవరగట్టు బన్నీ ఉత్సవాలలో భాగంగా నిర్వహించే కర్రల సమరంపై ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: