ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన కొత్త పలుకులో ఎప్పుడూ ఏపీ సీఎం జగన్ పై విమర్శలు సంధిస్తూనే ఉంటారు. జగన్ ఏం చేసినా తప్పుబడుతూనే ఉంటారు. అయితే.. ఎప్పుడూ విమర్శలే కాదు.. అప్పుడప్పుడు ఆయన జగన్ తీరును మెచ్చుకుంటూ కూడా చాలా అరుదుగా రాస్తుంటారు. అలాంటి ఓ అద్భుతం తాజా కొత్త పలుకులో చోటు చేసుకుంది. ఇంతకీ ఆర్కే అంతగా జగన్‌ను మెచ్చుకోవడానికి కారణం.. జగన్ క్రమంగా మారుతున్నాడట. మొదట్లో ఉన్నంత మొండిగా ఉండటం లేదట.


ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందా అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోందట. అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రభుత్వపరంగా జరుగుతున్న లోపాలను ఇటు మీడియాగానీ, అటు ప్రతిపక్షాలు గానీ ఎత్తి చూపినా జగన్‌ పట్టించుకునే వారు కాదని... అయితే ఈ మధ్య కొన్ని పొరపాట్లను వెంటనే సవరించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆర్కే అంటున్నారు. సంక్షేమ పథకాల వల్ల తన పట్ల ప్రజాదరణ చెక్కు చెదరడం లేదని నమ్ముతూ వచ్చిన ఆయన ఇప్పుడిప్పుడే వాస్తవ పరిస్థితులను గ్రహించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారని ఆర్కే అంటున్నారు.


అయితే మన ఆర్కే ఊరికే జగన్‌ను పొగుడుతాడా.. ఆ పొగడ్తలోనూ విమర్శ ఉండాల్సిందే కదా.. విమర్శ ఏంటంటే.. తన ప్రభుత్వంపై మధ్యతరగతి ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్న వాస్తవం జగన్‌కు తెలిసి వచ్చిందట. నిజానికి పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడిందట. కొన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నప్పటికీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల వల్ల ప్రజల్లో అసహనం పెరుగుతోందట. సాహసమే ఊపిరిగా ముందుకు సాగిపో అని న్యాయవ్యవస్థతో ఢీ కొంటున్న విషయంలో నీలిబ్యాచ్‌ డప్పు కొడుతుండవచ్చు గానీ విద్యావంతులు మాత్రం ఈ విషయంలో జగన్‌ వైఖరిని తప్పుబడుతున్నారట.


ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడిందట. క్షేత్రస్థాయిలో నెలకొన్న ఈ పరిస్థితులను తెలుసుకున్నారో లేదో తెలియదు గానీ కొన్ని విషయాలలో జగన్‌ పట్టువిడుపులు ప్రదర్శిస్తున్నారు అంటూ ఆర్కే మెచ్చుకున్నారు. అంటే మెచ్చుకుంటూనే జగన్ సర్కారుపై జనంలో వ్యతిరేకత పెరిగిందన్న తన వాదన జనంలోకి వెళ్లేలా ఆర్కే జాగ్రత్త పడుతున్నారు. మరి ఆర్కేనా.. మజాకా..? 

మరింత సమాచారం తెలుసుకోండి: