డాక్టర్ వల్లే కరోనా సోకిందని, తనకు కావాలనే వైరస్ అంటించాడని ఓ నర్సు కోర్టును ఆశ్రయించింది.  ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ఆస్పత్రిలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) కిట్లు లేవని అడిగినందుకు డాక్టర్ వైరస్ ను అంటించాడని ఆమె ఫిర్యాదు పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. వెనిస్ జీన్ బాపిస్ట్ అనే నర్సు తన యజమాని డాక్టర్ జోసఫ్ పిపెరాటోపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ ఫిర్యాదులో ఆమె ఈ విధంగా పేర్కొంది. మార్చి నెలలో మియామి బీచ్ లో జరిగిన డ్యాన్స్ ఫెస్టివల్ కు డాక్టర్ హాజరయ్యాడని, కొద్ది రోజుల తర్వాత అతడిలో కరోనా లక్షణాలు కనిపించాయన్నారు. దీని కంటే ముందు ఆస్పత్రిలో పీపీఈ కిట్లు లేదని డాక్టర్ కు చెప్పినప్పుడు డాక్టర్ పట్టించుకోలేదన్నారు. దీంతో పాటు పేషంట్లకు, వైద్య సిబ్బందికి, స్టాఫ్ నర్సులకు ఎన్-95 మాస్కులు కూడా లేవని చెప్పామన్నారు. ఆస్పత్రిలో పీపీఈ కిట్లు, మాస్కులు అందించాలని పలుమార్లు డాక్టర్ కు తెలిపామన్నారు. కానీ ఆయన ఎప్పుడు పట్టించుకోలేదన్నారు.

కరోనా లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ తో కలిసి హాల్ లో నడుస్తున్నప్పుడు ఓ సారి కరోనా టెస్ట్ చేయించుకోమని సలహా ఇచ్చాను. అప్పుడు ఆయన నా వైపు తిరిగి దగ్గి.. ఇప్పుడు నాకు కరోనా ఉంటే నీకు వస్తుందని చెప్పాడని నర్సు తెలిపింది. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత నాకు, నా రెండేళ్ల కొడుకుకి కరోనా లక్షణాలు వచ్చాయని ఆమె పేర్కొంది.

కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకున్నప్పుడు రిపోర్టుల్లో పాజిటివ్ వచ్చిందని, రెండు వారాల పాటు కరోనాతో పోరాడుతూ ఆస్పత్రిలో నరకం చూశామని ఆమె పేర్కొంది. ప్రస్తుతం కరోనా బారి నుంచి కోలుకున్నప్పటికీ.. తనకు జరిగిన నష్టానికి డాక్టర్ నష్టపరిహారం చెల్లించాలని ఆమె కోర్టును ఆశ్రయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: