బీహార్‌లో బీజేపీ ఉచిత కరోనా వ్యాక్సిన్‌ హామీ..  తీవ్ర దూమారం రేపుతోంది. కమలం పార్టీపై విపక్షాలు ఎదురుదాడి చేస్తున్నాయి‌. బీహార్ వాసులకే ఉచితంగా ఇస్తారా? అసలు వ్యాక్సిన్ లాంటి అంశాన్నీ ఓట్లకు ముడిపెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి‌.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో పెద్ద దుమారం రేపుతోంది. జేడీయూతో కలిసి తాము మరోసారి అధికారంలోకి వస్తే.. బీహార్ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామంటూ బీజేపీ తమ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ అంశం రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధాన్ని ఇచ్చింది. ప్రాణాలను కాపాడే కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను కూడా తమ స్వార్థ రాజకీయాల కోసం, ఎన్నికల్లో ఓట్లకు ముడిపెడతారా అంటూ ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి.

ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీ ఇవ్వడంపై శివసేన తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యింది. మిగిలిన రాష్ట్రాలు భారత్‌లో కాకుండా పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో ఏమైనా ఉన్నాయా.? అని ప్రశ్నించింది. ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చెత్త రాజకీయాలు చేస్తోందని మండిపడింది. ఇలా మాట్లాడే వారు సిగ్గుపడాలన్నారు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే.

మొన్నటి వరకు ఎన్డీఏలో కేబినెట్ మంత్రిగా కొనసాగిన అకాలీదళ్ నేత హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కూడా  బీజేపీపై మండిపడ్డారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కరోనా వ్యాక్సిన్‌ను వినియోగించుకోవడం అనైతికమన్నారు. ఫ్రీ వ్యాక్సిన్ బీహార్ కేనా? దేశంలో ఇతర ప్రాంతాలు ట్యాక్స్‌లు కట్టడం లేదా? వాళ్లు భారత పౌరులు కాదా? అని ప్రశ్నించారు. కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికీ అందించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉందన్నారు.

ఈ అంశం పెద్ద దుమారం రేగడంతో బీజేపీ స్పందించింది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నామమాత్రపు ధరకు వ్యాక్సిన్ అందిస్తుందని.. అయితే దాన్ని రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇవ్వడమా, లేకపోతే ఆ ధరను ప్రజల వద్దే వసూలు చేయడమా అనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలని చెప్పుకొచ్చింది. బీహార్‌లో మాత్రం బీజేపీ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించిందంటూ కవర్‌ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: