ఏపీ కాంగ్రెస్ నేత, అమరావతి మహిళా జేఏసీ నాయకురాలు  సుంకర పద్మశ్రీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. రాష్ట్రంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి.... ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం దుష్ట రాజకీయాలు చేస్తోందని ఆమె మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఏపీకి చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోయారన్నారు. ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని, పోలవరం వంటి వాటిపై ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. కిషన్ రెడ్డి వచ్చిన రోజే అమరావతి రాజధానిలో ప్రభుత్వం రైతులపై అక్రమ కేసులు పెట్టిందని ఆమె అన్నారు.

ఒక కేంద్రమంత్రిగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలనుపట్టించుకోవాల్సిన అవసరం లేదా ? అని నిలదీశారు. రాజధానిలో ప్రభుత్వం రైతులపై, రైతు కూలీలపై , రాష్ట్రంలో దళితులు , మహిళలపై    ఇన్ని అరాచకాలు చేస్తుంటే కిషన్ రెడ్డి కి పట్టదా ?  అని ప్రశ్నించారు. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ఎలా పాలన చేయాలో ప్రధాని మోదీ ఢోలేరా స్మార్ట్ సిటీ కోసం , తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ కోసం  డిసైడ్ చేస్తున్నారని, వాళ్ళు మాత్రం వాళ్ల రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

బీజేపీకి దగ్గర అవ్వాలని టీడీపీ, కేసులకు భయపడి జగన్ కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారని విమర్శించారు. వరదలు వచ్చి ప్రజలు నరకం చూస్తున్నారు వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అయ్యవారు వచ్చేవరకు అమావాస్య ఆగదు... కేంద్ర బృందం వచ్చేవరకు బాధితులను అదుకోరా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వరద బాధితులను ఆదుకోవాలి అని ఆమె డిమాండ్ చేసారు. సోము వీర్రాజుకు రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయడం రాదుగాని రెండు సంవత్సరాల్లో అమరావతిలో పార్టీ కార్యాలయం నిర్మిస్తామని చెబుతున్నారన్నారు. బీజేపీ నేతలకు అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేలా ఒత్తిడి చేయాలి అని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: