వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడులపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయవాడలో బీజేపీ కొత్త ఆఫీస్ ఏర్పాటుచేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఒకటేనని, పార్టీల పరంగా వేరు వేరు అయినా, ఆ ఇద్దరి సిద్ధాంతాలు ఒకటేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడంలో, కేంద్రం నుంచి వస్తున్న నిధుల్ని మింగేయడంలో, అవినీతి, అక్రమాలకు పాల్పడడంలో జగన్, చంద్రబాబులిద్దరూ కవల పిల్లలని అన్నారు. పైకి అక్రమాలను బయటపెడతా అంటూ ఒకరి మీద ఒకరు సవాళ్ళు విసురుకుంటారే తప్ప, ఏ ఒక్కరూ ఆ అక్రమాలను బయటపెట్టరని అన్నారు. ప్రతిసారీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటారే తప్ప చర్యలు తీసుకోరని వెల్లడించారు. 



వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాలను బయటపెడతానని చెప్పిన జగన్ ఇప్పటివరకూ ఏమీ చేయలేకపోయారని, రాజధాని ప్రాంతంలో 64 వేల మంది రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా చంద్రబాబు వదిలేస్తే, ఆ ప్లాట్లు ఇప్పిస్తామని జగన్ హామీ ఇచ్చి మాట తప్పారని సోము వీర్రాజు అన్నారు. బాబు ఎలా ఐతే మోసపూరిత మాటలతో పబ్బం గడిపారో, అచ్చం అలానే జగన్ కూడా అదే తీరును ఆవలంభిస్తున్నారని మండిపడ్డారు. గతంలో నీరు – చెట్టు అక్రమాలపై నిజాలు నిగ్గు తేలుస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఎందుకు సైలెంట్ అయిపోయిందో సమాధానం చెప్పాలని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను  గత ప్రభుత్వం లానే, వైసీపీ ప్రభుత్వం కూడా దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో టిడిపి ప్రభుత్వం చేసిన తప్పులను, ప్రస్తుతం వైసీపీ చేస్తున్న తప్పులను ఏకిపారేస్తామని, ఆ ఇద్దరిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావన బీజేపీకి లేదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: