తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రాజెక్టు నేడు హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో ఇప్పటికే నిర్మాణం పూర్తి అయ్యి , ప్రారంభోత్సవాలకు రెడీగా ఉన్న ఇళ్లను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. హైదరాబాద్ జియాగూడ లోని 840 ఇళ్లూ, కట్టెల మండి లో 120, గోడే కా కబర్ లో 192 ఇళ్లను మంత్రి కేటీఆర్ అర్హులైన నిరుపేదలకు అందించారు. 


ఇల్లు లేని నిరుపేదలు అందరికీ అన్ని వసతులతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని 2014 ఎన్నికల సమయంలోనే టిఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో మినహాయించి, అనేక చోట్ల నిర్మాణ పనులను నేటికి కొనసాగిస్తూనే ఉంది. దీంతో పూర్తయిన నిర్మాణాలను పంపిణీ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే నేటి నుండి ఇళ్ల పంపిణీ మొదలుపెట్టారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాదులోని పలు ప్రాంతాల ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా మాట్లాడిన కేటిఆర్ ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అని పెద్దలు సామెత చెబుతున్నారని ఈ రెండు పనులు చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని అని పేర్కొన్నారు. అయితే ఇల్లు నేనే కట్టిస్తా పెళ్లి నేనే చేస్తా అని అన్నది సీఎం కేసీఆర్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్న మంత్రి కేటీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా నిరుపేద ఆడపిల్లల వివాహాలకు లక్ష నూట పదహారు రూపాయలు అందిస్తున్నామని కూడా గుర్తు చేశారు.


టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 40 లక్షల నుండి 50 లక్షల విలువచేసే ఇళ్లను కట్టించి ఇస్తుందని చెప్పిన కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 75 వేల పైచిలుకు ఇళ్ళు కడుతున్నామని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని ఈ ఇళ్ల మార్కెట్ విలువ 70 వేల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: