ఎప్పుడూ పప్పు అని పిలిపించుకుంటూ, సొంత పార్టీ నాయకుల అసంతృప్తికి గురవుతూ,  తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి వైసీపీ నాయకులతో తిట్లు తింటూ, రాజకీయ అసమర్ధుడిగా పేరు పొందిన  లోకేష్ వ్యవహారంపై ఎప్పుడూ పార్టీలో చర్చ జరుగుతూనే ఉంటుంది. చంద్రబాబు తన తరువాత లోకేష్ ను టిడిపి అధ్యక్షుడిగా నియమించాలని, కుదిరితే ఏపీ సీఎంగా బాధ్యతలు అప్పగించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఆయన పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకునే విధంగా చేస్తూ, పార్టీపై పట్టు సాధించేలా చేయాలనే తలంపుతో ఉంటుండగా, లోకేష్ తన ప్రసంగాలలో  నిత్యం తప్పులు దొర్లే విధంగా, టంగ్ స్లిప్ అవుతుండడం, ఇలా ఎన్నో వ్యవహారాలు చోటుచేసుకోవడంతో, ఆయన రాజకీయంగా అభాసుపాలు అవుతూనే వస్తున్నారు.


 ఇదిలా ఉంటే, లోకేష్ వ్యవహారశైలిపై సొంత పార్టీ నేతల్లోనే సదాభిప్రాయం లేదు. లోకేష్ చేతికి టిడిపి పగ్గాలు అప్పగిస్తే, పార్టీ పరిస్థితి మరింతగా దెబ్బతింటుందని, కోలుకోలేని విధంగా తయారవుతుందని, సొంత పార్టీ నాయకులు సైతం నమ్ముతున్నారు. ముఖ్యంగా ఆయన ప్రత్యర్థులను ఉద్దేశించి చేసే విమర్శల్లో పస లేకపోవడం, పొంతనలేని మాటలతో వివాదం అవడం వంటి కారణాలతో లోకేష్ అసమర్థుడుగా ముద్ర వేసుకుంటూ వచ్చారు. అయితే అదంతా గతం ! ఇప్పుడు లోకేష్ అన్ని విషయాల్లోనూ, తన పారదర్శకతను నిరూపించుకుంటూ, పదునైన బాణాలతో ప్రత్యర్థులను విమర్శిస్తూ, తప్పులు లేకుండా ప్రసంగాలు చేస్తూ, అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.


అలాగే తన శరీర ఆకృతిని కూడా మార్చుకుని మరింత ఆకర్షణీయంగా తయారయ్యారు. ప్రస్తుతం లోకేష్ ప్రత్యర్థులను విమర్శించే విషయంలో కానీ, రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు వేయడంలో కానీ ,బాబును మించి పోయే స్థాయికి లోకేష్ తయారవడం వంటి వ్యవహారాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రస్తుతం లోకేష్ జిల్లాల వారీగా పర్యటనలు చేస్తున్నారు. ముందుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ, రైతులకు భరోసా ఇస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వ్యవహరిస్తున్న తీరు చూసి, టిడిపి నాయకులే నమ్మ లేకపోతున్నారు. అసలు లోకేష్ ఇంత గా మారిపోతాడు అని , పప్పు అనే ముద్దుపేరు తొలగించుకుంటూ తన సామర్ధ్యం పెంచుకుంటాడు అని ఎవరూ నమ్మలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: