జనసేన పార్టీ సహకారంతో 2024 ఎన్నికల్లో తప్పనిసరిగా తాము విజయం సాధిస్తామనే ధీమా బిజెపిలో ఉంది. కేంద్రంలో అధికారపార్టీ కాబట్టి, వచ్చే ఎన్నికల నాటికి బాగా బలం పుంజుకుని, మిగతా అన్ని రాజకీయ పార్టీల కంటే పై చేయి సాధిస్తామని, ఎంతో ధీమాగా ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. కేంద్ర బిజెపి పెద్దలు సైతం ఏపీలో బీజేపీ బాగా బలపడుతుందని, గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగ్గా ఉందని, అంచనా వేస్తున్నాయి.  అయితే క్షేత్రస్థాయిలో బిజెపి బలం పుంజుకొకపోవడం, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన పరిస్థితి కూడా దాదాపు ఇదే విధంగా ఉండడం, జనాల్లోకి దూసుకుపోయే విషయంలో కానీ, ప్రజాసమస్యలను పట్టించుకుంటూ ప్రజలకు మద్దతుగా ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో కానీ, బిజెపి జనసేన పార్టీలు ప్రస్తుతం వ్యవహరిస్తున్న విధానం ఖ చ్చితంగా వారికి ఏమాత్రం ఉపయోగ పడదు.


ఎందుకంటే, ఏపీలో అధికారం దక్కించుకోవాలి అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. రాజకీయంగా ప్రజలలోను బలంగా పాతుకుపోయిన టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను తట్టుకోవడం, వారి కంటే తాము మెరుగు అనే విషయాన్ని ప్రజల్లోకి  తీసుకు వెళ్లడం, ఇవన్నీ బిజెపి జనసేన కు కష్టమే. వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉంటే, బిజెపి నాయకులు మాత్రం తాము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని పదేపదే చెబుతూ, పార్టీ నాయకుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో కాస్తో కూస్తో విమర్శలు చేస్తూ, ప్రజా సమస్యలపై పోరాటం చేసినట్టుగా బిజెపి నాయకులు కనిపించారు.


 కానీ ఆ తర్వాత కేంద్రంలో జగన్ అవసరం బిజెపికి ఉండటంతో, ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అనేక ప్రజా సమస్యల విషయంలో గాని, ప్రభుత్వాన్ని నిలదీసే అంశంలో బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. ఎక్కడా, ప్రశంసలు, విమర్శలు అనే ప్రస్తావన లేకుండా పాలన సాగిపోతోంది.బీజేపీతో వైసిపి కేంద్రంలో పొత్తు పెట్టుకోకపోయినా, ఏపీ నేతలతో పాటు, మిగతా రాజకీయ వర్గాలు అన్ని, ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది అనే అభిప్రాయంతోనే ఉన్నారు. దీంతో బిజెపి నేతలు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసేందుకు సాహసించడం లేదు. ఇంకా మూడేళ్లు పైగా సమయం ఉంది. అప్పటికైనా బిజెపి పుంజుకుంటుందనే నమ్మకం పార్టీ నేతలు ఎవరిలోనూ లేదు.


ఇలా ఎన్నో కారణాలు లెక్కలు వేసుకుంటే, ఏపీలో బీజేపీ జనసేన కూటమికి అధికారం అందని ద్రాక్ష అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీని ముంచెత్తిన వరదలు కారణంగా, ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో వారికి ప్రభుత్వ సాయం కోసం బిజెపి డిమాండ్ చేసి, ప్రజల తరఫున నిలబడితే కాస్తో కూస్తో మైలేజ్ పెరిగేది. కానీ ఎవరికి వారే అన్నట్టుగా బిజెపి నేతలు సైలెంట్ గా ఉండడం వంటి వ్యవహారాలను లెక్కలు వేసుకుంటే, బీజేపీ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: