ఇటీవల గీతం యూనివర్సిటీలో ఆక్రమణలను రాష్ట్ర ప్రభుత్వం తొలగించాలనే ప్రయత్నం చేసింది. ప్రహరీ గోడ కూల్చివేత సహా.. మరింత ముందుకెళ్లాలనే ప్రయత్నాని హైకోర్టు స్టే ఆర్డర్ తో అడ్డుకుంది. పోనీ కొన్ని నిర్మాణాలు దెబ్బతిన్నా.. విద్యార్థుల చదువుకి వచ్చే ఇబ్బందేమీ లేదు. కానీ గీతం మెడికల్ కాలేజీ అనుమతి రద్దు అయితే మాత్రం వందలాది మంది విద్యార్థులు రోడ్డునపడాల్సి వస్తుంది. అయితే ఇది అనుకున్నంత సులభంగా అవుతుందా లేదా అనే విషయం తేలాల్సి ఉంది.

గీతం మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు చేయాలంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్ఎంసీకి లేఖ రాయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. నిబంధనలు అతిక్రమించడంతో పాటు అవకతవకలకు ప్పాలడిన విశాఖపట్నంలోని గీతం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, రీసెర్చి (GIMSR‌)పై చర్యలు తీసుకోవాలని జాతీయ వైద్య మండలికి విజయసాయిరెడ్డి సోమవారం లేఖ రాశారు. సంస్థ గుర్తింపును రద్దు చేయాలని కోరారు.

గీతం మెడికల్ కాలేజీ నిర్వహిస్తున్నస్థలం ప్రభుత్వానిదని, మొత్తంగా గీతం విద్యా సంస్థలు ఎండాడ గ్రామంలో 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించాయని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి నడుపుతున్న మెడికల్ కాలేజీకి అసలు గుర్తింపు ఎలా వచ్చిందో అనుమానంగా ఉందని తెలిపారు. గుర్తింపుకోసం దరఖాస్తు చేసుకునే సమయంలో గీతం యాజమాన్యం నకిలీ డాక్యుమెంట్లు సమర్పించిందని ఆయన ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. ఈమేరకు విచారణ అనంతరం.. GIMSR కు ఇచ్చిన ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్‌ రద్దు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి సూచించాలని ఆయన జాతీయ వైద్య మండలిని కోరారు.

విజయసాయిరెడ్డి లేఖ ప్రకారం గీతం మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు అయితే విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడుతుంది. గతంలో కూడా ఇలాగే ఫాతిమా మెడికల్ కాలేజీ అనుమతులు రద్దైన సమయంలో విద్యార్థులు రోడ్డునపడ్డారు. వీరిని వేరే కాలేజీల్లో సర్దుబాటు చేసేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. ఇదే జరిగితే గీతంలో ఎంబీబీఎసం చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: