కోరనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు చేరుకున్న టైమ్ లో.. ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ అంతటినీ ధనిక దేశాలు గుంపగుత్తగా తీసేసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. సంపన్న దేశాలైన అమెరికా, బ్రిటన్‌, జపాన్‌ సహా వివిధ యూరోపియన్‌ దేశాలు ఆయా ఫార్మా సంస్థలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ రేసులో పేద దేశాలు వెనుకబడటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అంటే కరోనా వ్యాక్సిన్ తొలి దశలో కేవలం ధనిక దేశాలకు చెందిన ప్రజలకు మాత్రమే అందుబాటులోకి వస్తుందనే విషయం స్పష్టమైంది. మరి పేద దేశాలు ఏం చేయాలి. పేద దేశాల్లో ప్రజలు ఇంకా కరోనాతో ఇబ్బంది పడుతుంటే.. కేవలం ధనిక దేశాలు మాత్రమే వ్యాక్సిన్ తో ఉపశమనం పొందాలా? అని ప్రశ్నిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ప్రపంచ దేశాలకు ఓ సూచన చేశారు. కరోనా వ్యాక్సిన్ తో వివిధ దేశాలు తమ ప్రజలనే మొదట కాపాడుకోవాలనుకోవటం సహజమేనని.. అయితే దీనివల్ల కొవిడ్‌ నిర్మూలనకు మరింత సమయం పడుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ధనిక దేశాలు తొలుత వ్యాక్సిన్ ని తమ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తే.. పేద దేశాలన్నీ ఇబ్బంది పడతాయని ఆయన  ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ధనిక దేశాల్లో కరోనా తగ్గిపోయినంత మాత్రాన ఫలితం లేదని పేద దేశాలలో కరోనా విజృంభిస్తుంటే.. ధనిక దేశాలకు అది ఎంతమాత్రం లాభదాయకం కాదని తేల్చి చెప్పారు. కేవలం కొన్ని దేశాల్లో అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం కంటే.. అన్ని దేశాల్లో కొందరికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా.. సమతూకం ఉంటుందని చెప్పారు.

ప్రపంచ దేశాలు భేదాభిప్రాయాలు పక్కనపెట్టి ఏకతాటిపై నడవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ‘కోవాక్స్‌’ పేరుతో అంతర్జాతీయ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంది. అయితే ఈ సంస్థకు అమెరికా నిధులు ఆపేయడంతో ఆ ప్రక్రియకు విఘాతం కలుగుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా 11 లక్షలమందిని బలి తీసుకుంది. సగానికి పైగా కొత్త కేసులు యూరోపియన్‌ దేశాలకు చెందినవే కావటం గమనార్హం. మరోవైపు భారత్ లో అసలు కరోనా వ్యాక్సిన్ తొలిదశలో ఎవరికి ఇవ్వాలో లిస్ట్ పంపించండి అంటూ.. కేంద్రం రాష్ట్రాలకు ఓ సూచన చేసిందని, దాని ప్రకారం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పేరున్న వైద్య సిబ్బంది జాబితా తయారవుతోందని కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: