కొన్ని సంప్రదాయాలు జనంలో బలంగా నాటుకుపోతాయి. అలాంటి వాటిని అధికారులు ఆపలేరు.. పోలీసులు కట్టడి నిలువరించలేదు.. కర్నూలు జిల్లా దేవరగట్టులో అదే జరిగింది. ఇక్కడ దసరా మరుసటి రోజు రాత్రి మాలమల్లేశ్వర స్వామి ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపులో మూడు గ్రామాల ప్రజలు పాల్గొంటారు. మాల మల్లేశ్వర స్వామి కోసం కర్రలతో కొట్టుకుంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. కానీ.. ఈ కర్రల సమరంలో చాలా మందికి తీవ్ర గాయాలవుతాయి.

ఈ విషయం అధికారులకు తెలిసినా.. ఎంతగా ప్రజల్లో ప్రచారం చేసినా అడ్డుకోలేని దుస్థితి. అందుకే అధికారులు కూడా అంబులెన్సులు ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉంటారు. ఆచారం ఆపలేనప్పుడు కనీసం నష్టాన్ని నివారించాలి కదా. అందుకే ఈ ఏర్పాట్లు.. ఏటా ఈ కర్రల సమరంలో వందల మంది గాయపడుతుంటారు.. ఒక్కోసారి తీవ్రగాయాలతో చనిపోతుంటారు కూడా. ఇంత ప్రమాదం అని తెలిసినా.. ఈ మూడు గ్రామాల ప్రజలు ఏటా ఈ కర్రల సమరం చేస్తూనే ఉంటారు.

అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఈ కర్రల సమరాన్ని కలెక్టర్ వీరపాండియన్ రద్దు చేశారు. రెండు, మూడు రోజుల ముందే ఈ విషయం బాగా ప్రచారం చేశారు. దేవరగట్టుకు వచ్చే అన్ని మార్గాల్లోనూ పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేశారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. స్థానికులు తప్ప బయటివారిని రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఉత్సవానికి కూడా మూడు గ్రామాల నుంచి ఒక్కో గ్రామం నుంచి 50 మందిని మాత్రమే అనుమతించేలా ఏర్పాటు చేశారు.

ఇన్ని ఏర్పాట్లు చేసినా.. అర్థరాత్రి సమయానికి జనం దూసుకొచ్చారు. కర్రల సమరంలో భారీగా పాల్గొన్నారు. ఈ సారి కూడా కర్రల యుద్ధం యథావిధిగా సాగింది. దాదాపు 50 మంది వరకూ ఈ కర్రల సమరంలో గాయపడ్డారు. తీవ్రంగా గాయ పడిన ఇద్దరిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: