ఓవైపు చైనా ఇండియాతో కయ్యానికి కాలుదువ్వుతున్న వేళ.. భారత్‌, అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త ముందడుగు పడుతోంది. అత్యాధునిక సాంకేతితక, అంతరిక్ష పరిజ్ఞానం వంటి విష।యాల్లో  ఇండియాకు అమెరికా సాంకేతికత చేతికి అందబోతోంది. చైనా తరచూ ఇండియాపై కవ్వింపు చర్యలకు పాల్పడటం.. సరిహద్దుల్లో బలగాలను మోహరించడం వంటి చర్యలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో చైనాకు చెక్ పెట్టాలంటే అత్యాధునిక సాంకేతికత భారత్‌కు అత్యవసరం.

అందుకే ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ‘బేసిక్‌ ఎక్స్‌ఛేంజ్‌ అండ్‌ కోఆపరేషన్‌ అగ్రిమెంట్‌.. బెకా  ఒప్పందంపై నేడు, భారత్, అమెరికా దేశాలు సంతకాలు చేయనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా అత్యాధునిక సైనిక సాంకేతికత, వసతి కేంద్రాలతోపాటు అంతరిక్ష పరిజ్ఞాన సంబంధిత పటాలను పరస్పరం వినియోగించుకునేందుకు అవకాశం దక్కుతుంది. నేడు దిల్లీలో జరగనున్న 2+2 చర్చల్లో ఇరు దేశాల ప్రతినిధులు ‘బెకా’పై సంతకాలు చేస్తారు.

ఈ ఒప్పందంపై ఇప్పటికే మన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, అమెరికా రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ మధ్య చర్చలు జరిగాయి. అంగీకారం కూడా కుదిరింది. ఇక సంతకమే మిగిలింది. ఈ చర్చల్లో పాల్గొనేందుకే  అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, ఎస్పర్‌ నిన్న ఇండియాకు వచ్చారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఇవే అంశాలపై 2018 సెప్టెంబరులో దిల్లీలో మొదటి సారి, గత ఏడాది డిసెంబరులో వాషింగ్టన్‌లో రెండో దఫా చర్చలు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నవి మూడో దఫా చర్చలు.  

ఇలాంటి కీలక దశ చర్చలు జరుగుతున్న సమయంలో.. అమెరికా ఓ కీలక ప్రకటన చేసింది. ప్రాంతీయ, అంతర్జాతీయ శక్తిగా భారత్‌ అవతరిస్తుండటాన్ని తాము స్వాగతిస్తున్నామని ప్రకటించింది. అంతే కాదు... ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నామని  ప్రకటించడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: