ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇపుడు ఏపీ పరిస్థితి దారుణంగానే ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయాక కష్టాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దానికి తోడు అన్నట్లుగా రాజకీయమూ ముందుకొచ్చింది. ఈ క్రమంలో ఏపీ అప్పుల కుప్పగా మారితోంది. చిన్న రాష్ట్రం, చిదిమేసిన రాష్ట్రంగా ఏపీ ఉందిపుడు. ఏపీ విషయంలో రెండవ మాటకు తావు లేకుండా ఆదుకోవాల్సింది కేంద్రమే. అన్నింటి కంటే ముందుగా జాతీయ ప్రాజెక్ట్ పోలవరానికి దండీగా నిధులు ఇచ్చి పూర్తి చేయాల్సిన గురుతర బాధ్యత కేంద్రం మీద ఉంది.

అయితే కేంద్రం మాత్రం 2014 దగ్గరే ఆగిపోయింది. 20 వేల కోట్లను మాత్రమే పోలవరం కోసం ఇస్తామని ఫిక్స్ అయిపోయింది. అంతకు మించి ఒక్క పైసా కూడా ఇవ్వమని కేంద్రం అంటోంది అంటే అది ఏపీ రాజకీయ చేతకానితనంగానే చూడాలి. ఏపీలో ఇప్పటికిపుడు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 47 వేల కోట్ల దాకా నిధులు అవసరం మరి అంతా ఇచ్చేశాం,  పోలవరానికి  కేవలం 5 వేల కోట్లు మాత్రమే ఇక ఇవ్వాలని  మోడీ సర్కార్ అంటూంటే ఏపీ జనాల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.

ఇది చంద్రబాబుకో, జగన్ కో కావాల్సిన ప్రాజెక్ట్ కాదు, ఇది ఏపీ జనాలకు జీవనాడి. సగానికి పైగా జిల్లాలను సస్యశ్యామలం చేసే బహుళార్ధక ప్రాజెక్ట్ పోలవరం. అటువంటి దాన్ని పక్కన పెట్టాలని అనుకోవడం ఎవరికీ మంచిది కాదు. ఏపీ ఆర్ధిక పరిస్థితి ఏంటో కేంద్రానికి తెలుసు. ఇంత తెలిసినా కూడా ఇలా చేయడం పట్ల ఏపీ జనాలు మండుతున్నారు.

అయితే కేంద్రంలోని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీ మాత్రం జగన్ని అదను చూసి దెబ్బకొట్టిందని అంటున్నారు. జగన్ ఎటూ కిక్కురుమనలేని రాజకీయ చట్రంలో ఇరుక్కుంటారని భావించే ఇలా చేశారని అంటున్నారు. అంటే ఇక్కడ రాజకీయాలే ముఖ్యం అయ్యాయి తప్ప అయిదు కోట్ల ప్రజల ప్రయోజనాలు కావా అని సామాన్యులు అంటున్నారు. ఏది ఏమైనా జగన్ విషయంలో బీజేపీ ఒక రకమైన వ్యూహాన్ని అమలు చేస్తోందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. జగన్ ఏమీ చేయలేరన్న ధీమాతోనే ఇల హఠాత్తుగా ప్రాజెక్ట్ వ్యయం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారని కూడా అంటున్నారు. చూడాలి మరి జగన్ ఏది  చేసి కేంద్రం నుంచి నిధులు దక్కించుకుంటారో.

మరింత సమాచారం తెలుసుకోండి: