తెలంగాణ ఉప ఎన్నిక దుబ్బాక రాజకీయం యమా రంజుగా సాగుతోంది. ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్‌ కు గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తోంది. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌ రావు నామినేషన్ వేసిన రోజు నుంచే ఆయన్ను టార్గెట్ చేసారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పదే పదే ఆయన వాహనాలను తనిఖీ చేయడం.. ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు చేయడం ద్వారా టీఆర్ఎస్ సర్కారు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. తాజాగా సోమవారం జరిగిన ఘటనలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

నిన్న సిద్దిపేటలో రఘునందన్ రావు మామ ఇంటిలో పోలీసులు దాడులు చేశారు. 18 లక్షల రూపాయల నగదు గుర్తించారు. ఆ నగదు స్వాధీనం చేసుకునే సమయంలో బీజేపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. పోలీసుల చేతుల్లోనుంచి నగదు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో రఘునందన్‌ రావు కూడా స్పృహ కోల్పోయారు. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రావడంతో సీన్ ఉద్రిక్తంగా మారింది.

బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకున్న సమయంలో తనతో దురుసుగా ప్రవర్తించారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బండి సంజయ్.. సీపీ జోయల్ డేవిస్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ తాను నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. బండి సంజయ్ దీక్షతో సీన్ మరింత ఉద్రిక్తంగా మారింది. బండి సంజయ్ దీక్షపై ఏకంగా అమిత్ షా కూడా స్పందించినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బండి సంజయ్ కు ఫోన్ చేసి ఏం జరిగిందో అమిత్ షా ఆరా తీశారట.

దుబ్బాక, సిద్దిపేటల్లో టీఆర్‌ఎస్‌ సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. కేవలం బీజేపీనే టార్గెట్ చేస్తూ పోలీసులను అస్త్రాలుగా ప్రయోగిస్తోందని బండి సంజయ్ అమిత్ షాకు ఫిర్యాదు  చేసినట్టు తెలుస్తోంది. కేంద్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ- టీఆర్ఎస్ సంబంధాలు దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో మరింత దిగజారే ప్రమాదం కనిపిస్తోంది. చూడాలి ముందు ముందు ఇంకెన్ని చిత్రాలు జరుగుతాయో. 

మరింత సమాచారం తెలుసుకోండి: