టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడు సాగునీటి తగాదా నడుస్తుంది. నియోజకవర్గానికి అన్యాయం చేస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక నిన్న నిరసనలకు కూడా దిగిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తాజాగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. కుప్పం టిడిపి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, టిడిపి మండల పార్టీ బాధ్యులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో వైసిపి ఉద్రిక్తతలు సృష్టిస్తోంది అని... రౌడీయిజం, గుండాయిజంకు పాల్పడుతోంది అని చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేసారు. బిసి, ఎస్సీ, ఎస్టీ మైనారిటిలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రూ 430 కోట్లతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లో 86 శాతం టిడిపి పూర్తి చేసింది అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. 123 కిమీ కాలువ తవ్వకానికి గాను 121 కిమీ పూర్తయ్యింది అని ఆయన తెలిపారు.

మిగిలిన 14 % పనులను గత 18 నెలల్లో వైసిపి ప్రభుత్వం పూర్తి చేయలేదు అని బాబు మండిపడ్డారు. 2 నెలల్లో చేయాల్సిన పని, 2 సీజన్లు పూర్తయినా, 2 ఏళ్లు అవుతున్నా పూర్తి చేయక పోవడం కుప్పం పట్ల వైసిపి కక్ష సాధింపునకు నిదర్శనం అని అన్నారు. 86 శాతం పనులు టిడిపి పూర్తి చేస్తే, మిగిలిన 14 శాతం  పూర్తి చేయడానికి చేతులు రావా..? అని ఆయన నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులకు టిడిపి హయాంలో నీళ్లిచ్చాం అని అన్నారు. పులివెందులలో చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడాం అన్నారు. ఎటువంటి వివక్షత లేకుండా అన్నిప్రాంతాలకు న్యాయం చేశాం అని చెప్పారు. అలాంటిది కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను ఏడాదిన్నరగా నిలిపేయడం వైసిపి కక్ష సాధింపు చర్య అని విమర్శలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: