తెలుగుదేశం పార్టీ ఇపుడు కొంత కరోనా భయాన్ని తగ్గించుకుంది. తండ్రీ కొడుకుల ప్రవాస రాష్ట్ర వాసంలో ముందుగా కొడుకు లోకేష్ పూర్తి చేసుకున్నట్లుగా ఉంది. ఆయన జిల్లాల టూర్లు వేస్తున్నారు. ఒక విధంగా ఏడెనిమిది నెలలుగా టేడీపీ ఇబ్బందులు పడుతోంది. అధినాయకులు ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుంటే వైసీపీ ఇక్కడ ఏపీలో  దూకుడు రాజకీయం చేస్తూ వచ్చింది. దాంతో తమ్ముళ్ళు ఒంటరి పోరాటమే చేసారు. కరోనా వల్ల బాబు ఎటూ రాలేకపోతున్నారు, మరి లోకేష్ ని అయినా పంపించవచ్చు కదా అన్న డిమాండ్లు వినిపించేవి. మొత్తానికి చినబాబు అలా వచ్చి  ఏపీలో జోరు పెంచేశారు.

ఆయన అనంతపురం, గోదావరి జిల్లాలలో తిరుగుతూ వరద బాధితులను పరామర్శిస్తూ హడావుడి బాగానే చేస్తున్నారు. ఇక గోదావరి జిల్లాల టూర్లో ఆయన ట్రాక్టర్ కూడా నడిపారు. అయితే ఆ ట్రాక్టర్ రూట్ మారిపోయింది. ఏకంగా ఏట్లోకి దూసుకుపోయింది. అయితే లోకేష్ తృటిలో ఆ ప్రమాదం నుంచి  తప్పించుకున్నారు. దాని మీద విపక్షాల నుంచి సెటైర్లు బాగానే పడ్డాయి. ట్రాక్టర్ నే నడపలేని లోకేష్ పార్టీని ఏం నడుపుతారు అంటూ కామెంట్స్ కూడా వచ్చిపడ్డాయి.

అయితే ట్రాక్టర్ ని నడపడం, పార్టీని నడపడం ఒక్కటి కాదు అన్నది మాత్రం నిజం. ట్రాక్టర్ నడిపిన వాళ్ళంతా పార్టీని నడపలేరు. నడపని లోకేష్ బాబు లాంటి వారు అంతా పార్టీని నడపడానికి పనికిరారు అని కూడా చెప్పడానికి వీలు లేదు. టీడీపీకి ఎంత కాదనుకున్నా లోకేష్ ఒక జోష్ తెచ్చారు. ఆయన మాట తీరు మారింది. ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా మారింది. ఆయన విమర్శలు కాస్తా పదునెక్కాయి. బాబు మాదిరిగా కాకపోయినా ఇప్పటికిపుడు టీడీపీకి లోకేష్ వంటి నాయకుడు దొరకడం అంటే గొప్పగానే చూడాలి. ఇంకా ఎన్నికలకు మూడున్నరేళ్ళ సమయం ఉంది. లోకేష్ తనను తాను తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగితే రేపటి రోజు అన్నది కచ్చితంగా టీడీపీకి ఉంటుంది అంటున్నారు. అదే సమయంలో పార్టీ నేతలను కూడా ఆయన కలుపుకుని పోవడం చాలా ముఖ్యం.





మరింత సమాచారం తెలుసుకోండి: