రాజకీయాలు అంటేనే అలాగే ఉంటాయి. పరమపద సోపానం కోసం పడరాని పాట్లు పడుతూంటారు. అందుకోసం ఎన్ని అయినా చేయాలి. ఏవైనా త్యాగాలు చేయాలి. తర తమ భేదాలు కూడా లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే రాజకీయం అంటే జన బాహుల్యంతో ముడిపడి ఉంటుంది. అందరినీ కలుపుకుని పోకపోతే మాత్రం చిత్తు అవుతారు. తెలుగుదేశం మీద గత ఎన్నికల్లో బలమైన ముద్ర పడిపోయింది. కమ్మల పార్టీ అని అంతా వ్యతిరేకించారు. దాంతో ఘోర పరాజయం ఆ పార్టీని పట్టి పీడించింది.

ఇక జగన్ అధికారంలోకి వచ్చాక తన సొంత సామాజిక వర్గం రెడ్లను పక్కన పెట్టి మరీ బీసీలకు, ఇతర బడుగు వర్గాలకు పెద్ద పీట వేయడానికి అసలు కారణం కూడా ఇదే. ఇప్పటికీ జగన్ బీసీలకు యాభై శాతం నామినేటెడ్ పదవులు అంటున్నారు. దాంతో వైసీపీ వస్తే అందలాలు ఎక్కుదామనుకున్న రెడ్లు రగిలిపోతున్నారు. జగన్ కి అత్యంత సన్నిహితులు, బంధువులు కూడా పదవులు తమకు లేవా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కానీ జగన్ మాత్రం బాబుని చూసి ఇలా చేయకపోతే టీడీపీకి పట్టిన గతే తమ పార్టీకి కూడా పడుతుంది అని ముందు చూపుతోనే వ్యవహరిస్తున్నారు అంటున్నారు. ఇపుడు చంద్రబాబు కూడా మెల్లగా జగన్ బాటలోనే వెళ్తున్నారుట. తన పార్టీకి కూడా బీసీ, బడుగుల పార్టీ అన్న ముద్ర కోసం ఆయన తపిస్తున్నారు. ఈ మధ్యన ఆయన పార్టీ కమిటీలను ప్రకటించారు. అవన్నీ కూడా దాదాపుగా బీసీలు, బలహీనులకే ఇచ్చారు. ఇక రానున్న రోజుల్లో కూడా ఇలాగే చేస్తానని బాబు చెబుతున్నారని టాక్.

అంటే కమ్మల హవా టీడీపీలో ఇక అంతరించినంట్లే అనుకొవాలి. నిజానికి ఈ పని ఎపుడో చేయాలి. కానీ విపక్షంలోకి వచ్చాక కానీ చంద్రబాబుకు తత్వం బోధపడలేదు అంటున్నారు. సరే ఇన్నాళ్లకు ఆయన మంచి పనే చేస్తున్నారు. కేవలం కొందరికే కాకుండా అన్ని వర్గాలకు వారి  సామాజిక నిష్పత్తి ఆధారంగా పదవులు ఇస్తే మేలు జరుగుతుంది. అన్ని వర్గాలు తమ పార్టీ అనుకుంటేనే అధికారంలోకి రావడం జరుగుతుంది.ఇక జగన్ కూడా బీసీలను పెద్దల సభకు పంపి చరిత్ర‌ సృషించారు.  రానున్న రోజుల్లో ఈ అధినేతలిద్దరి రాజకీయ   పరుగుపందెంలో బడుగులకు వరదలా పదవులు దక్కుతాయని అంటున్నారు చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: