దుబ్బాకలో నిన్న జరిగిన పరిణామాలపై ఎస్పీ స్పందించారు. ఎన్నికల సిబ్బంది పకడ్బందీగా తమ విధులు నిర్వహిస్తుందని ఆయన అన్నారు. ఎవరికో ఒకరికి ఫెవర్ చేయడం అనేది అవాస్తవం అని ఆయన స్పష్టం చేసారు. సిద్దిపేట, మెదక్  రెండు జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది అని ఆయన అన్నారు.  ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ (తహసిల్దార్), ఏసీపీ నేతృత్వంలో బృందాలు తనిఖీలు చేశాయి అని ఆయన పేర్కొన్నారు. ఎవరికి ఏ అనుమానాలు ఉన్నా ఫిర్యాదు చేయవచ్చు అని ఆయన సూచించారు.

నిన్న నాలుగు ప్రదేశాల్లో సోదాలు చేస్తే ఒక్కరి వద్దనే డబ్బులు దొరికాయి అని ఆయన అన్నారు. తనిఖీల సమయంలో వీడియో గ్రాఫ్, ఫోటో గ్రాఫ్ తీయడం జరిగింది అని ఎస్పీ వివరించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే కావాలనే మా  సిబ్బందితో గలాటా చేసి డబ్బులు  లాక్కున్నారు అని అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేశారు అన్నారు. ఈ సంఘటనపై 27 మందిపై కేసు నమోదు చేసాం అని వివరించారు.  ఎగ్జక్యూటివ్ అధికారి పంచనామా పూర్తి చేసి బయటకు వచ్చేముందు బీజేపీ కార్యకర్తలు దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్లారు అని అన్నారు.

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి మధ్యాహ్నం నుండి  జరుగుతున్న సంఘటనలు ఫోన్లో వివరించాం అని ఆయన తెలిపారు. సిద్దిపేటకు వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ముందస్తు సమాచారం తెలిపామని అన్నారు. ఎంపీ సిద్దిపేట కు వచ్చే ప్రయత్నం చేయగా అదుపులోకి తీసుకుని తిరిగి కరీంనగర్ పంపించడం జరిగింది అని అన్నారు.  ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలన్నారు. అధికారులు సీజ్ చేసిన నగదును ఎత్తుకెళ్లాడం పెద్ద నేరం అని ఆయన మండిపడ్డారు. ఉప ఎన్నికల ప్రచారం కోసం వచ్చే వారిని ఎవరిని కూడా అడ్డుకోవడం చేయడం లేదు అని ఆయన పేర్కొన్నారు. ఉప ఎన్నికల కోసం అదనంగా పోలీస్ సిబ్బంది ఎర్పాటు చేశాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: