ఆంధ్రప్రదేశ్‌లో చాలాకాలంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పలు రకాల చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు దానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ సంఖ్య 25 కాకుండా 26గా తెలుస్తోంది. ఈ విషయమై కొత్త జిల్లాల ప్రకటనపై రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త జిల్లాలకు సంబంధించి వచ్చే ఏడాది జనవరి 26న స్పష్టమైన ప్రకటన ఉంటుందని కోన రఘుపతి వెల్లడించారు. గుంటూరులోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మీడియాతో మాట్లాడారు.

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినట్లు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. అయితే అరకు నియోజకవర్గం విషయంలో సంక్లిష్టత ఏర్పడిందని చెప్పారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. కాగా ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే కొన్ని నియోజకవర్గాల విషయంలో సమస్య ఉండటంతో ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం సూచించిన విధంగానే కమిటీ కూడా నివేదిక రూపొందిస్తే ఏపీలో మొత్తం 25 జిల్లాలు ఏర్పాటు కావడం దాదాపు ఖాయమే.

అయితే విశాఖపట్నం జిల్లా అరకు లోక్ సభ నియోజకవర్గం విషయంలో సందిగ్ధత నెలకొంది. విస్తీర్ణం పరంగా అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా గుర్తింపు తెచ్చుకున్న అరకు పార్లమెంట్ స్థానం మొత్తం 4 జిల్లాల్లో విస్తరించింది. నియోజకవర్గంలోని పాలకొండ శ్రీకాకుళం జిల్లాలో ఉండగా, సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో ఉన్నాయి. అరకు, పాడేరు విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతుండగా, రంపచోడవరం మాత్రం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉంది. ఇలా ఒక లోక్ సభ నియోజకవర్గం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండటం... అందులోనూ ఈ నియోజకవర్గంలో గిరిజన జనాభా ఎక్కువ ఉండటంతో అరకు జిల్లా ఏర్పాటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా, కమిటీ దీనిపై ఓ క్లారిటీకి వచ్చినట్లు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చెప్పిన మాటలను బట్టి అర్థమవుతోంది. అరకు పార్లమెంటు స్థానాన్ని రెండుగా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘుపతి ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: