ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా పూర్తి లాక్ డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం మరలా ఇప్పుడు వరుసగా అన్ లాక్ ల పేరుతో వివిధ సడలింపులు ఇస్తూ వస్తుంది. అయితే అన్‌లాక్-5 షెడ్యూల్ మరో నాలుగు రోజుల్లో అక్టోబర్ 31తో ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ నెలలో విడుదల చేసిన అన్‌లాక్-5 మార్గదర్శకాలనే మరో నెల పాటు (నవంబర్ 30 వరకు) పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి ప్రత్యేక కారణం ఏంటంటే అసలే ఇది పండుగల కాలమని మరిన్ని సడలింపులు ఇచ్చినట్లయితే వైరస్ ప్రభావం మరింత ఉధృతం కావచ్చుననే ఉద్దేశ్యంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ పండుగ సీజన్ లో ఇక ఎలాంటి సడలింపులు ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా అక్టోబర్‌ నెలకు ప్రకటించిన నిబంధనలే నవంబర్‌ నెలాఖరు వరకు వర్తిస్తాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం (అక్టోబర్ 27) సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొంది.

కరోనా వైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో నవంబర్ 30 వరకు అన్ని రకాల ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కరోనాపై పోరాటమే లక్ష్యంగా అక్టోబర్ 8న ప్రధాని మోదీ ‘జన్‌ ఆందోళన్‌’ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని హోంశాఖ విజ్ఞప్తి చేసింది. మాస్క్‌లు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరుచుకోవడం, కనీసం 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం లాంటివి ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని కోరింది. ఎవరూ కూడా అనవసరంగా బయట తిరగవద్దని అలాగే చిన్న పిల్లలు, వృద్ధుల విషయమై చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇలా అన్ని రకాల సూచనలు తప్పక పాటించాలని విజ్ఞప్తి చేసింది






మరింత సమాచారం తెలుసుకోండి: