ప్రతి నెలా మొదటి తేదీన వాలంటీర్లు ఇంటికొచ్చి మరీ పింఛన్ ఇచ్చి వెళ్తుంటారు. అయితే వచ్చే నెల మొదటి తేదీన పింఛన్ ఇవ్వాలంటే.. కచ్చితంగా లబ్ధిదారులంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలనే నిబంధన పెట్టారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. టెస్ట్ చేయించుకున్నవారికే మొదటి రోజు పింఛన్ ఇస్తారని, మిగతా వారికి ఆలస్యం అవుతుందని పల్లెటూళ్లలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో సామాజిక పింఛన్ అందుకునే లబ్ధిదారులంతా ఆందోళన పడుతున్నారు. తమకు పింఛన్ రాదేమోనని అనుమానిస్తున్నారు. అసలేంటి ఈ వ్యవహారం, పింఛన్ తీసుకునేవారంతా కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందేనా..?
రాష్ట్రవ్యాప్తంగా సామాజిక పింఛన్ తీసుకునే లబ్ధిదారులందరికీ కరోనా టెస్ట్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో నిర్బంధం ఏమీ లేదు. అలా నిర్బంధంగా టెస్ట్ చేయడానికి ఏ చట్టమూ ఒప్పుకోదు. అందులోనూ పింఛన్ ఇవ్వడానికి, కరోనా టెస్ట్ కి సంబంధం కూడా లేదు. స్వచ్ఛందంగా ముందుకొచ్చినవారికి సచివాలయాల్లో ఏఎన్ఎం ఆధ్వర్యంలో కరోనా టెస్ట్ చేయిస్తారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామస్థాయిలో చాలామందికి కరోనా టెస్ట్ చేయిస్తున్నారు కూడా.

అయితే ఎవరు మొదలు పెట్టారో తెలియదు కానీ.. గ్రామాల్లో ఈ కరోనా టెస్ట్ లపై విపరీతంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పింఛన్ తీసుకునేవారంతా కచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలని, లేకపోతే పింఛన్ ఇవ్వరని కొంతమంది చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో కలకలం రేగింది. అయితే అధికారులు మాత్రం అలాంటి నిబంధన ఏదీ లేదని, గ్రామ స్థాయిలో టెస్ట్ ల సంఖ్య పెంచేందుకే పింఛన్ తీసుకునే వారందరికీ ఒకే దఫా టెస్ట్ లు చేస్తున్నామని చెప్పారు. సచివాలయ సిబ్బందితో కరోనాపై మరింత అవగాహన కల్పిస్తామంటున్నారు. సామాజిక పింఛన్ అందుకునేవారెవరూ ఆందోళన పడొద్దని, కరోనా టెస్ట్ కి, పింఛన్ కి సంబంధం లేదని స్పష్టం చేశారు.  గ్రామాల్లో జరుగుతున్న ఈ పుకార్లను అధికారులు ఖండించారు. వచ్చే నెల మొదటి తేదీ కూడా యథావిధిగా వాలంటీర్లు అందరి ఇళ్లకు వచ్చి పింఛన్ ఇస్తారని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: