కరోనా సెకండ్ వేవ్ మొదలవుతుందని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తుతున్న వేళ.. భారత ప్రభుత్వం మాత్రం అన్ లాక్ అంటూ నిబంధనలు సడలించుకుంటూ పోతోంది. దీంతో సెకండ్ వేవ్ కనక మొదలైతే.. అన్ని దేశాలకంటే ఎక్కువ నష్టపోయేది భారత్ మాత్రమేనని అంటున్నారు వైద్య నిపుణులు. అన్ లాక్ మార్గదర్శకాలను నవంబరు 30వరకు పొడిగించడంపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా అన్ లాక్ మార్గదర్శకాలను నవంబర్ 30వరకు పొడిగిస్తున్నట్టు తెలిపిన కేంద్ర ప్రభుత్వం, కంటైన్మెంట్ జోన్ల బయట అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతిస్తున్నట్లు మరోసారి స్పష్టం చేసింది. మార్చి 24వ తేదీన తొలి లాక్‌డౌన్‌ ఉత్తర్వుల్లో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఆ తర్వాత కేవలం కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే ఆంక్షలు విధించి, మిగతా చోట్ల సడలించారు. ఇప్పుడు కంటైన్మెంట్ జోన్ల బయట దాదాపుగా జనజీవనం సాధారణ స్థితికి వచ్చేసింది. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉదారంగానే ఉన్నా.. సెకండ్ వేవ్ అంటూ వార్తలొస్తున్న వేళ.. మరింత ఉదాసీనత పనికి రాదని అంటున్నారు నిపుణులు.

ఇప్పటికే మెట్రో రైళ్లు, షాపింగ్ ‌మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు.. ప్రార్థనా మందిరాలు, జిమ్ లు, సినిమా హాళ్లు, అమ్యూజ్ మెంట్ పార్క్ లు.. ఇలా అన్నిటికీ కేంద్రం అనుమతులిచ్చేసింది. అయితే సినిమా హాళ్లు మాత్రం కరోనా భయంతో ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. రెస్టారెంట్లు, హోటళ్లు కూడా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలు పెట్టలేదు. ప్రజలే భయపడుతున్న వేళ, ప్రభుత్వం అంత ఉదాసీనంగా ఉండటం సరికాదనేది కొంతమంది వాదన. అన్నిటికీ తానే అనుమతులిచ్చిన కేంద్రం.. పాఠశాలలు, కోచింగ్‌ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, 100 మందికి మించి జనం గుమి కూడటానికి సంబంధించిన కార్యకలాపాల విషయంలో అనుమతుల్ని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికారాలకే వదిలిపెట్టింది. అయితే కేంద్రం కూడా కరోనా సెకండ్ వేవ్ ని దృష్టిలో ఉంచుకుని కంటైన్మెంట్ జోన్ల బయట కొన్ని కార్యకలాపాలపై ఇంకా నిషేధం కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చేవరకు స్వీయ నియంత్రణ అవసరం అని, ప్రభుత్వ ఆంక్షలు లేకపోతే ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడం అసంభవం అని హెచ్చరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: