జాతీయ పార్టీలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. అయితే అవి కేంద్ర  ఎన్నికల సంఘం దగ్గర రిజిష్టర్ అయినవి కావు. ఎన్నికల సంఘం గుర్తించాలి అంటే దానికి చాలా నిబంధనలు ఉన్నాయి. ఇక ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయిన తరువాత టీడీపీ జాతీయ పార్టీగా మారిపోయింది. 2014 లో తెలంగాణాలో కూడా పోటీ చేసింది. బాగానే ఓట్లు సీట్లు వచ్చాయి. 2018లో మరో మారు పోటీ చేసింది. ఈసారి ఊపు తగ్గిపోయింది. దాంతో తెలంగాణాలో టీడీపీ నామ మాత్రంగానే పార్టీగా ఉంది. అక్కడ పార్టీ మీద అధినాయకత్వానికే పెద్దగా  ఆసక్తి లేదని అంటారు.

ఇదిలా ఉంటే జాతీయ పార్టీ అని మాటిమాటికీ జబ్బలు చరచే తమ్ముళ్ళు తెలంగాణాలో దుబ్బాక అనే చోట ఉప ఎన్నిక జరుగుతున్న సంగతిని మరచినట్లున్నారు అని సెటైర్లు పడుతున్నాయి. సాక్షాత్తు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణాలోనే ఉంటున్నారు. ఎక్కడా లేని విధంగా కోట్ల రూపాయ‌లతో నిర్మించిన అతి పెద్ద పార్టీ భవనం కూడా తెలంగాణాలో ఉంది. మరి తెలంగాణలో ఉప ఎన్నిక జరిగితే పోటీ చేయకపోవడమేంటి అన్నది పెద్ద ప్రశ్నే.

అంతేనా దుబ్బాకలో బీజేపీ టీయారెస్ ల మధ్య హోరా హోరీ పోరు సాగుతున్నట్లుగా సీన్ ఉంది. అక్కడ బీజేపీ ప్రెసిడెంట్ ని అడ్డుకున్నారని, అరెస్ట్ చేశారని వార్తలు కూడా వస్తున్నాయి. మరి కేంద్రంలోని మోడీ, అమిత్ షా, సహా ఇతర కేంద్ర మంత్రులకు ఎవరికైనా తలనొప్పి అని తెలిస్తే చాలు కర్టెసీ కాల్ చేసి బీజేపీ నా జట్టు అని సంబరపడిపోయే టీడీపీ అధినాయకత్వం బండి సంజయ్ విషయంలో కనీసం ఒక్క ఫోన్ కాల్ చేయకపోవడం అంటే విడ్డూరమే మరి.

పైగా హైదరాబాద్ కు వందేళ్ల తరువాత అతి పెద్ద వరదలు వచ్చాయి. జనాలంతా అధికార పార్టీనే వేలెత్తి చూపారు. కనీసం ఇలా చేయండి అలా చేయండి అని సూచనలు అయినా ఇవ్వలేని నిస్సహాయతతో టీడీపీ జాతీయ  పార్టీ ఉండడం దారుణమే. ఎంతసేపూ ఏపీలో కరోనా, వరదలు, గొడవలు అంటూ తెల్లారిలేస్తే జూమ్  యాప్ ముందేసుకుని విరుచుకు పడిపోయే టీడీపీ పెద్దలు తెలంగాణా గురించి పల్లెత్తు మాట అనకూడదని ఒట్టేసుకున్నారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా చంద్రబాబు ఉమ్మడి ఏపీని దాదాపు తొమ్మిదేళ్ళు పాలించిన నేత. అటువంటి ఆయన తెలంగాణాలో తన జాతీయ పార్టీని ఫుల్ సైలెంట్ మోడ్ లో పెట్టేయడం కంటే వింత మరోటి ఉండదేమో అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: