మంగళవారం ఢిల్లీలో విజిలెన్స్‌, అవినీతి నిరోధక సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అవినీతి గురించి కొన్ని కామెంట్లు చేశారు. అవినీతి కేసుల విచారణ త్వరగా జరగాలని.. వీటిలో జాప్యం జరిగితే అది.. అవినీతిపరులకు.. ఇతరులకు చెడు సంకేతాలు పంపుతుందని అన్నారు. ఈ మాటలు మోదీ రొటీన్ గానే అని ఉండొచ్చు. కానీ.. జగన్ ను టార్గెట్ చేయాలనుకున్న మీడియాకు ఈ డైలాగ్స్ భలే నచ్చేశాయి.

అందుకే ఇవాళ తమ పత్రికల్లో ఈ డైలాగుల్నే పతాక శీర్షికలుగా పెట్టాయి. ఇవి చదివిన వారికి మోడీ జగన్ గురించే అన్నాడేమో అనే అభిప్రాయం కలిగేలా వార్తలు వండి వార్చారు. ఇంతకీ ప్రధాని మోడీ ఇంకా ఏమన్నారంటే... వంశపారపర్యంగా వచ్చే అవినీతి దేశానికి  పెద్ద సవాల్‌గా మారిందని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సమర్ధవంతమైన ఆడిట్‌ సహా అవినీతి అంతానికి వ్యవస్ధాగతమైన పరిశీలన అవసరం అని ప్రధాని అభిప్రాయపడ్డారు.  అవినీతిపై పోరాటం అన్నది ఏ ఒక్క సంస్ధ బాధ్యత మాత్రమే కాదని అన్నారు. అది సమిష్టి పోరాటం అని గుర్తు చేశారు.

అవినీతి అంతం దిశగా తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపిన మోదీ అందుకు కారణమైన పలు చట్టాలను  తాము రద్దు చేశామని గుర్తు చేశారు. అంతే కాదు.. నల్లధనం కట్టడికి తమ ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలను ఇతర దేశాలు కూడా ఫాలో అవుతున్నాయని గొప్పగా చెప్పుకొచ్చారు. అంతే కాదు.. వేల కోట్ల రూపాయల కుంభకోణాలు, షెల్‌ కంపెనీల ఏర్పాటు వంటి సంస్కృతిని తమ ప్రభుత్వం దూరం చేసిందని తమ సర్కారు పనితీరుపై గొప్పలు చెప్పుకున్నారు.

వంశపారపర్య  అవినీతి చెదపురుగుల్లా దేశాన్ని నాశనం చేసిందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ రకమైన అవినీతి రాజకీయ సంస్కృతిలో భాగంగా మారిపోయిందని మోదీ చేసిన కామెంట్లు ఎవరి గురించి అన్న చర్చ కూడా ఇప్పుడు మీడియాలో మొదలైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: